తాడిపత్రిలో ఉద్రిక్తత... జేసీ ఇంటిపై వైకాపా కార్యకర్తల రాళ్ల దాడి - MLA pedda reddy news
13:47 December 24
తాడిపత్రిలో ఉద్రిక్తత... జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైకాపా కార్యకర్తల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైకాపా ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. సామాజిక మాధ్యమాల్లో కిరణ్ అనే వ్యక్తి తనను విమర్శిస్తున్నారని పెద్దారెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి, అతని అనుచరులు వాహనాల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి వచ్చి వాగ్వాదానికి దిగారు.
అక్కడే ఉన్న కిరణ్‌పై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపర్చారు. జేసీ వర్గీయులు కూడా ఎదురుదాడికి దిగడంతో యుద్ధవాతారణం నెలకొంది. ఇరు వర్గాలు రాళ్లదాడి దిగడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంలో పెద్దారెడ్డి కూర్చున్న కుర్చీని జేసీ అనుచరులు తగులబెట్టారు.
తాడిపత్రిలో జేసీ ఇంటిపై దాడి జరగడం ఇదే తొలిసారి. గతంలో రాజకీయ నేతలు పరస్పరం తీవ్ర స్థాయిలో విమర్శించుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ, ఇంటిపైకి వచ్చి దాడి చేయడంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. దాడి నేపథ్యంలో జేసీ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. జేసీ అనుచరులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు.