మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్‌ను అనిశా అధికారులు బంజారాహిల్స్‌లోని అనిశా ప్రధాన కార్యాలయానికి తరలించారు. మాచవరంలోని క్యాంపు కార్యాలయం నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. బుధవారం ఉదయం ఆయన కార్యాలయం, ఇంట్లో అధికారులు సోదాలు చేసి పలు కీలక పత్రాలను తీసుకున్నారు. కొంపల్లిలో నగేష్ నివాసంలో లాకర్ తాళాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇతర ఉన్నతాధికారుల పాత్రపైనా ఆరా తీస్తున్నారు. ఆర్డీవో అరుణా రెడ్డి, ఎమ్మార్వో అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసిమ్ అహ్మద్, నగేష్ బినామీ జీవన్ గౌడ్లను అరెస్ట్ చేసి నర్సాపూర్ నుంచి అనిశా ప్రధాన కార్యాలయానికి తరలించారు.
ఎకరాకు లక్ష చొప్పున
112 ఎకరాల విస్తీర్ణంలో భూమికి ఎన్ఓసీ ఇవ్వడం కోసం అదనపు కలెక్టర్ నగేష్ లంచం డిమాండ్ చేశాడు. ఎకరాకు లక్ష చొప్పున 1 కోటీ 12 లక్షలు ఇవ్వాలని కోరాడు. మొదటి విడతలో 19.5 లక్షలు, మరో సారి 20.5 లక్షలను బాధితుడు లింగమూర్తి నుంచి నగేష్ తీసుకున్నాడు. మిగిలిన 72 లక్షల కోసం 5 ఎకరాల భూమిని నగేష్ బినామీ జీవన్ గౌడ్ పేరు మీద అగ్రిమెంట్ చేయించుకున్నాడు. భూమి రిజిస్ట్రేషన్ అయ్యేవరకు జామీనుగా బాధితుని నుంచి 8 ఖాళీ చెక్కులను నగేష్ తీసుకున్నాడు.