మెదక్ అదనపు కలెక్టర్, నర్సాపురం ఆర్డీవో, తహసీల్దార్ అరెస్టు - మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వార్తలు
15:30 September 09
మెదక్ అదనపు కలెక్టర్, నర్సాపురం ఆర్డీవో, తహసీల్దార్ అరెస్టు
ఓ రైతు నుంచి భారీగా లంచం డిమాండ్ చేసిన మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ సహా నర్సాపూర్ ఆర్డీవో అరుణ, తహసీల్దార్ సత్తార్, నగేశ్ బినామీ జీవన్‌గౌడ్‌ను అనినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. మెదక్ మండలం మాచవరంలోని అదనపు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అనిశా డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి చెందిన మూర్తి అనే రైతుకు మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పలతుర్తిలో 112 ఎకరాల పట్టా భూమి ఉంది. దీనికి సంబంధించి ఎన్‌వోసీ ఇవ్వాలని మూర్తి ఇటీవల అదనపు కలెక్టర్ నగేశ్‌ను సంప్రదించారు. ఎన్‌వోసీ ఇచ్చేందుకు తనకు ఎకరాకు రూ.లక్ష చొప్పున రూ.1.12 కోట్లు ఇవ్వాలని అదనపు కలెక్టర్ డిమాండ్ చేశాడు.
ఇప్పటికే రూ.40లక్షల నగదు తీసుకున్న ఆయన.. మరో రూ.72లక్షల కోసం ఐదు ఎకరాల భూమిని తన బినామీ జీవన్‌గౌడ్ పేరుమీద అగ్రిమెంట్ చేయించుకున్నారు. ఈనేపథ్యంలో రైతు అధికారులకు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అనిశా అధికారులు నగేశ్ ఆస్తులపై ఏకకాలంలో 12 చోట్ల సోదాలు నిర్వహించారు. ఇతర రెవెన్యూ అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేశారు.