ఇటీవల హైదరాబాద్ తార్నాకలో ఇద్దరు యువకులు చేసిన రోడ్డుప్రమాదం.. ఓ ఇంటి యజమాని ప్రాణాలు తీసింది. పుట్టుకతో దివ్యాంగురాలైన ఓ కుమార్తెకు తండ్రిని దూరం చేసింది. తనకు దిక్కెవరంటున్న ఆ కుమార్తె ప్రశ్నలకు సమాధానం లేకుండా పోయింది. పుట్టిన రోజునాడే ప్రాణాలు కోల్పోయిన ఆ పెద్దాయన.. తన కుమార్తె విజయాన్ని చూడకుండానే అనంతలోకాలకు వెళ్లిపోవడం కుటుంబ సభ్యులు, బంధువులను శోకసంద్రంలోకి నెట్టింది.
అసలేం జరిగింది..
హైదరాబాద్ సరూర్‌నగర్ వెంకటేశ్వరకాలనీకి చెందిన సుబ్బారావు ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేసి, కొద్ది రోజుల క్రితమే పదవీ విరమణ పొందారు. భార్య మంగళగౌరి, కుమార్తె యశస్వినితో కలిసి గత 30 ఏళ్లుగా అక్కడే నివాసముంటున్నారు.
సారీ చెప్పి వెళ్లిపోయారు..
పుట్టుక నుంచే దివ్యాంగురాలైన కుమార్తె యశస్విని అల్లారుముద్దుగా పెంచుకున్న సుబ్బారావు.. సీఏ చదివిస్తున్నారు. ఈనెల 19న సీఏ పరీక్ష ఉండడం వల్ల.. ముందుగానే హబ్సీగూడలోని పరీక్షా కేంద్రాన్ని చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో రోడ్డు దాటుతున్న సుబ్బారావును అతివేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టగా ఆయన అక్కడికక్కడే కిందపడిపోయాడు. ఉప్పల్‌కు చెందిన ప్రదీప్ అతని స్నేహితుడితో కలిసి ఎలాంటి లైసెన్స్ లేకుండా ద్విక్రవాహనం నడిపి.. సుబ్బారావును ఢీ కొట్టారు. అనంతరం సుబ్బారావు ఇంటికి సమాచారం అందించారు. ఆటోలో ఇంటికి తీసుకువచ్చి.. 'సారీ ఆంటీ తమ వల్ల తప్పు జరిగిపోయింది' అని చెప్పినట్లు బాధితులు తెలిపారు.
అనంతరం కుటుంబసభ్యులు హుటాహుటిన ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడం వల్ల కోమాలోకి వెళ్లిపోయారు. చికిత్స పొందుతూ సుబ్బారావు గత ఆదివారం ప్రాణాలు విడిచారు. బాధితుల ఫిర్యాదుతో ఈ కేసును దర్యాప్తు చేసిన ఓయూ పోలీసులు రోడ్డు ప్రమాదానికి కారణమైన ప్రదీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. అసలు డ్రైవింగ్ లైసెన్స్ లేదని పోలీసులు గుర్తించారు. అతనిపై పలు సెక్షన్ల కేసు నమోదు చేశారు.