ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జడ్చర్ల నుంచి దేవరకద్ర, మరికల్, మక్తల్ మీదుగా కర్ణాటకలోని శక్తినగర్ వరకు విస్తరించి 167వ జాతీయ రహదారిని అడ్డాగా మార్చుకున్నారు. అక్కడ నిలిపి ఉన్న లారీల నుంచి డీజిల్‌ను దోచుకుంటున్నారు. డ్రైవర్, క్లీనర్లను బెదిరించి.. దాడిచేసి.. ఒక్కో వాహనం నుంచి రెండు వందల నుంచి నాలుగు వందల లీటర్ల వరకు డీజిల్‌ను కాజేస్తున్నారు. బృందాలుగా వచ్చి.. గుట్టుచప్పుడు కాకుండా నిమిషాల వ్యవధిలోనే పనికానిచ్చేస్తున్నారు. నిత్యం ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నా.. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం వల్ల వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది.
ఏం చేస్తారు..
రోడ్డు పక్కన నిలిపిన లారీలు, మరమ్మతులకు గురైనా వాహనాలను ఎంపిక చేసుకుంటారు. ఒంటరిగా ఉన్న డ్రైవర్, క్లీనర్లను బెదిరిస్తారు. కార్లలో బృందంగా వచ్చి.. వారి వెంట తెచ్చుకున్న కట్టర్లతో డీజిల్ ట్యాంకులను ఖాళీచేస్తారు. నిమిషాల వ్యవధిలోనే అక్కడ నుంచి పరారవుతారు. దోచుకున్న ఇంధనాన్ని పెట్రోల్ బంకుల కంటే తక్కువ ధరకే విక్రయించి.. నిత్యం వేల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు.
దారి దోపిడీలు..
ఇదే బృందాలు రాత్రి వేళలో దారి దోపిడీలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఒంటరిగా వెళ్తున్న ద్విచక్రవాహదారులను అడ్డగించి.. వారి నుంచి డబ్బు తీసుకుంటున్నారు. ఈ మధ్యన నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో.. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న గుడెబల్లూర్ దగ్గర ఓ పెట్రోల్ బంకు నుంచి సుమారు 1,375 లీటర్ల డీజిల్‌ను కాజేశారు. జనవరి 6 తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. దీనిపై బంకు యజమానులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. పెట్రోల్ బంక్ భూగర్భంలో నిలువచేసే ఇంధన ట్యాంకుల గొట్టాలను ఊడ గొట్టి.. ప్రత్యేకంగా సిద్ధం చేసుకున్న ప్లాస్టిక్ చేతిపంపులు ద్వారా కాజేశారు.