పెద్దపులి దాడిలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కుమురం భీం జిల్లా దహెగాం మండలం దిగడ గ్రామానికి ఒకవైపు పెద్దవాగు, మరోవైపు అడవి ఉంటుంది. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులు సిడాం విఘ్నేశ్(22), శ్రీకాంత్, నవీన్‌లు పెద్దవాగులో చేపలు పట్టేందుకు వెళ్లారు. వాటిని పంచుకునేందుకు అవసరమైన ఆకుల కోసం నవీన్, శ్రీకాంత్‌లు అడవిలోకి వెళ్లగా.. విఘ్నేశ్ వాగు పక్కన ఉన్నారు. తన వైపు ఓ పులి రావడం గమనించిన అతడు సమీపంలోని చెట్టుపైకి ఎక్కడానికి ప్రయత్నించారు. పులి ఒక్క ఉదుటున వచ్చి అతడిపై పంజా విసిరింది. నడుము భాగంలో తీవ్ర గాయమైన అతడు కింద పడ్డారు. అతడి మెడను నోటకరుచుకుని పులి అడవిలోకి వెళ్లింది. అతడి కేకలు విన్న మిత్రులు గ్రామంలోకి వెళ్లి చెప్పడంతో గ్రామస్థులు హుటాహుటిన ఘటన స్థలానికి వచ్చారు. దాడి చేసిన ప్రాంతానికి సుమారు 100 మీటర్ల దూరంలో యువకుడిని నోటకరుచుకున్న పులి కనిపించింది. వారు బిగ్గరగా అరవడంతో మృతదేహాన్ని వదిలి పారిపోయింది. ఓ వ్యక్తిపై పెద్దపులి దాడి చేసి చంపిన ఘటన రాష్ట్రంలోనే ఇదే తొలిసారి అని ఆసిఫాబాద్ డీఎఫ్‌ఓ శాంతారాం తెలిపారు. ఈ ప్రాంతంలో మూడు నెలలుగా పులి కదలికలున్నాయి. తాజా ఘటనతో సమీప గ్రామాల వారు భయాందోళనలకు గురవుతున్నారు.
పెద్దపులిని బంధించేందుకు ప్రత్యేక బృందాలు
పెద్దపులి దాడిలో దహెగాం మండలం దిగడ గ్రామ యువకుడు విఘ్నేశ్ మరణించిన నేపథ్యంలో అటవీశాఖ అప్రమత్తమైంది. దాడి చేసింది మగపులేనని నిర్ధారణకు వచ్చిన ఆ శాఖ, దాన్ని పట్టుకోవాలని నిర్ణయించింది. గురువారం ఉదయం నుంచి ప్రత్యేక బృందం రంగంలోకి దిగుతుందని, ఘటన జరిగిన ప్రాంతం సహా చుట్టుపక్కల బోన్లు అమర్చి దాన్ని బంధిస్తామని అధికారులు పేర్కొన్నారు. బాధితుడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని అటవీశాఖ నిర్ణయించినట్టు చెప్పారు.
కుమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కొంతకాలంగా పెద్దపులుల సంఖ్య, సంచారం పెరిగింది. కాగజ్‌నగర్ అటవీ డివిజన్ పరిధి కాగజ్‌నగర్, బెజ్జూరు, దహెగాం మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో ఐదారు పెద్దపులులున్నట్లు అటవీశాఖ అధికారుల అంచనా. మంచిర్యాల జిల్లాలో కలిపితే 10, 11 వరకు పెద్దపులులు తిరుగుతున్నట్లు వారికి సమాచారం ఉంది. ‘యువకుడిపై పులి దాడి చేసిన ప్రాంతంలో దొరికిన కాలిజాడలు, మృతుని శరీరంపై గోర్ల గాట్లను బట్టి అది మగపులి అనే నిర్ధారణకు వచ్చాం. దాడి జరిగిన తీరును విశ్లేషించిన మీదట అది అకస్మాత్తుగా జరిగిన ఘటనేనని భావిస్తున్నాం’ అని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు.