ఏపీలోని విశాఖ జిల్లా అనంతగిరి మండలం బురదగెడ్డలో దారుణం జరిగింది. మద్యం తాగేందుకు 'అమ్మ ఒడి' డబ్బులు ఇవ్వనందుకు భార్యను చంపాడు ఓ కిరాతకుడు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
'అమ్మఒడి' డబ్బులు ఇవ్వలేదని భార్యను కొట్టి చంపిన భర్త - విశాఖ జిల్లా నేర వార్తలు
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను చంపాడు ఓ ప్రబుద్ధుడు. ఈ దారుణ ఘటన ఏపీలోని విశాఖ మన్యంలో జరిగింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
గ్రామంలో తామల దేవుడమ్మ(36), భీమయ్య దంపతులు ఉంటున్నారు. 'అమ్మ ఒడి' పథకం కింద ఆ రాష్ట్ర ప్రభుత్వం అందించే నగదు దేవుడమ్మ అకౌంట్లో జమయ్యాయి. బుధవారం గుమ్మకోట సంత ప్రాంతానికి వెళ్లి తన అకౌంట్లోని నగదును ఆమె తీసుకుంది. అనంతరం మద్యం తాగేందుకు తనకు ఆ డబ్బులు ఇవ్వాలంటూ భార్య వెంటపడ్డాడు భీమయ్య. ఆమె ఒప్పుకోకపోవటం వల్ల దారిపొడవునా కొట్టుకుంటూ వెళ్లాడు. ఈ ఘర్షణలో ఆమె మృత్యువాత పడిందని స్థానికులు తెలిపారు. వారి సమాచారంతో భీమయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: దొంగ దొరికాడు: పోలీసుల నుంచి తప్పించుకున్నాడు.. కానీ తన్నులు తిన్నాడు!