హైదరాబాద్ వనస్థలిపురంలో ఆన్లైన్ గేమ్స్ ఆడి అప్పులపాలైన జగదీశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 'నేను ఆన్లైన్ గేమ్స్ ఆడి నష్టపోయాను, నన్ను క్షమించండి' అంటూ భార్యకు సెల్ఫీ వీడియో పంపి ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు.
అప్పుడు అప్పు తీర్చింది.. ఇప్పుడు ప్రాణం తీసింది..
సరదాగా మొదలుపెట్టిన ఆన్లైన్ గేమింగ్.. అలవాటుగా మారింది. ఆ అలవాటే ఆర్థికంగా తను చేసిన రూ.12 లక్షల అప్పు తీర్చింది. అప్పులన్నీ చెల్లించానని.. కాస్త డబ్బు కూడబెడదామనుకుని.. ఆన్లైన్ గేమ్స్ ఆడటం కొనసాగించాడు. కానీ.. ఈసారి అది నష్టాలను మిగిల్చింది. ఆ లోటు పూడ్చలేక.. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకునే వరకు దారితీసింది.
ఆన్లైన్ గేమింగ్‌లో నష్టపోయి వ్యక్తి ఆత్మహత్య
గతంలో చేసిన అప్పు రూ.12 లక్షలను ఆన్లైన్ గేమ్స్ ఆడటం ద్వారా చెల్లించిన జగదీశ్.. ఇప్పుడు అదే గేమ్స్ ఆడి నష్టపోయాడు. మృతునికి ఇద్దరు పిల్లలున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.