'కూలి'న బతుకులు: ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం - వికారాబాద్ జిల్లా వార్తలు
08:31 December 26
వికారాాబాద్ ప్రమాదంలో ఐదుకు చేరిన మృతుల సంఖ్య
కూలీ పనుల కోసం వెళ్లినవాళ్లపై విధి పగబట్టింది. కూలీ పనుల కోసం బయలుదేరిన వారిని బస్సు, లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఆ పేద బతుకులను కబళించింది. పని చేయాల్సిన శరీరాలు ప్రమాదంలో నుజ్జునుజ్జయ్యాయి. విగతజీవులుగా మారిన ఆ కూలీలను చూసి బంధువులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్న దృశ్యాలు కలిచివేస్తున్నాయి.
వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం చిట్టంపల్లి వద్ద ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీకొని ఘటనాస్థలిలో నలుగురు మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి.
క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చిట్టంపల్లి వద్ద కూలీలను ఎక్కించుకునేందుకు వేచిఉన్న ఆటోను ఆర్టీసీ బస్సు, లారీ ఒకేసారి ఢీకొట్టాయి. మృతులు శేణీబాయి(55), సంధ్య(18), నితిన్(15), సోనాబాయి(15), రేణుకా బాయి(26)గా గుర్తించారు. ఘటనా స్థలిని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పరిశీలించారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు.