తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఆ పెళ్లికి సినిమా ఫక్కీలో అడ్డంకులు... చివరికి ఏమైందంటే...! - ఆపండి

పాత సినిమాల్లోని క్లైమాక్స్​లోలాగా సాఫీగా సాగే పెళ్లిలో ఒక్కసారిగా... 'ఆపండీ...' అంటూ వచ్చే సౌండ్ ఆ మంటపంలోనూ వినిపించింది. కానీ... ఆ అరుపునకు ఆధారాల్లేవని అందరూ తేల్చేసి.... సగంలో ఆగిన పెళ్లి తంతును మళ్లీ మొదలుపెట్టారు. ఈలోపే ఇంకో సినిమాలోలాగా... అధికారులు మంటపానికి వచ్చి "ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు" అనే డైలాగ్​. అంతటితో ఆ పెళ్లి తంతుకు మధ్యలోనే శుభం కార్డు పడింది. అసలు ఆ వివాహానికి అన్ని విఘ్నాలేంటీ...? ఎందుకు ఆ పెళ్లి ఆగిపోయింది...?

maiiage stopped for various resons in mondamarket
maiiage stopped for various resons in mondamarket

By

Published : Nov 11, 2020, 7:39 PM IST

కల్యాణమొచ్చినా... కక్కొచ్చినా... ఆగదంటారు. రాసిపెట్టుంటే... ఎన్ని విఘ్నాలెదురైనా పంచభూతాలే పెళ్లిపెద్దలై ఇద్దరినీ ఒక్కటి చేస్తాయంటారు. ఇక్కడ మాత్రం వేరువేరు రూపాల్లో విఘ్నాలు ఎదురై పెళ్లిని అడుగడుగునా అడ్డుకున్నాయి.

బంధువుల హడావుడి... మధ్య సాగుతున్న పెళ్లిలో ఒక్కసారిగా.. 'ఆపండి' అంటూ ఓ యువతి ఆర్తనాదం. అంతా నిశ్శబ్దం. వరుడు తనను ప్రేమించి వేరే అమ్మాయి మెళ్లో తాళి కట్టేందుకు సిద్ధమయ్యాడంటూ... అందరి గుండెల్లో ఆ యువతి బండేసింది. ఆ విఘ్నాన్ని జయించి ఎలాగోలా వివాహాన్ని జరుపాలనుకుంటే... అసలుకే ఎసరు వచ్చింది. చివరికి ఆ మంటపంలో జరగాల్సిన పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది.

సికింద్రాబాద్​ మోండామార్కెట్ పీఎస్ పరిధిలోని వెస్లీ చర్చిలో జనగామ జిల్లా గుమ్మడి పాలెంకు చెందిన అనిల్... తుకారం గేట్​కు చెందిన అమ్మాయితో పెళ్లి జరుగుతోంది. ఇంతలో ఓ యువతి వచ్చి పెళ్లిని అడ్డుకుంది. వరుడు అనిల్ తనను ప్రేమించి మోసం చేశాడని గొడవకు దిగింది. విషయం తెలుసుకొని పోలీసులు రంగప్రవేశం చేయగా... అనిల్​కు ఆ యువతికి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి... ఆ అమ్మాయిని మంటపం నుంచి పంపించేశారు.

ఇక పెళ్లిని ఎలాంటి అడ్డంకి లేకుండా జరపాలని అందరూ ప్రార్థిస్తున్న సమయంలోనే... మరో విఘ్నం రానే వచ్చింది. ఈ సారి ఆ ఇబ్బంది... చైల్డ్​లైన్​​ అధికారుల రూపంలో ఎంటరైంది. పెళ్లి మండపంలోకి ప్రవేశించిన అధికారులు వధువు వయస్సు ఆరాతీశారు. పెళ్లికూతురు వయస్సు 17 ఏళ్లని తేలింది. అప్రమత్తమైన బంధువులు.. పెళ్లి కూతురు నిస్సికను కనిపించకుండా వరంగల్ పంపినట్లు అధికారులు తెలుసుకున్నారు.

ఈసారి మాత్రం పెళ్లి పూర్తిగా రద్దయింది. మధ్యలోనే ఆ మ్యారేజ్​ ఈవెంట్​కు శుభం కార్డు పడింది. మరోవైపు... చైల్డ్​లైన్ అధికారులు మోండా మార్కెట్ పీఎస్​లో ఫిర్యాదు చేయగా... వివాహ బంధువులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి:క్రికెట్ బెట్టింగ్​లో నష్టం.. ఇద్దరి ఆత్మహత్యాయత్నం.. ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details