తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పెళ్లింట భారీ చోరీ.. సినిమాను తలపించే స్టోరీ! - Mahabubnagar sp rajeshwari news

కొద్ది రోజుల్లో పెళ్లి. పెద్ద ఎత్తున కొనుగోలు చేసిన 65 తులాల బంగారం, దాదాపు రూ. 3 లక్షల నగదు అపహరణకు గురైంది. ఈ కేసు మహబూబ్​నగర్ జిల్లాలో సంచలనం రేపింది. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను అరెస్టు చేశారు.

సంచలనం రేపిన బోయినిపల్లి చోరీని కేసును ఛేదించిన పోలీసులు
సంచలనం రేపిన బోయినిపల్లి చోరీని కేసును ఛేదించిన పోలీసులు

By

Published : Dec 30, 2020, 8:07 PM IST

బోయినిపల్లి చోరీని కేసును ఛేదించిన పోలీసులు

మహబూబ్​నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బోయినిపల్లి గ్రామంలో పెళ్లి జరగాల్సిన ఓ ఇంట్లో ఈనెల 18న అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. పెళ్లి వారితో పాటు పెళ్లికొచ్చిన బంధువుల నగలు, పెళ్లి కోసం సమకూర్చుకున్న డబ్బు అంతా బీరువాలో దాచిపెట్టగా తెల్లవారేసరికి మాయమైంది. అదే రోజు ఊళ్లో ఓ ద్విచక్ర వాహనం సైతం చోరీకి గురైంది. పెద్ద మొత్తంలో బంగారం, నగదు, ద్విచక్రవాహనం చోరీకి గురి కావడం జిల్లాలో సంచలనం రేపింది.

పట్టించిన ప్లాస్టిక్ కవర్...

కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా ఓ ప్లాస్టిక్ కవర్​పై దొరికిన వేలిముద్రల్ని పాతనేరస్థుల వేలిముద్రల సమాచారంతో క్రోడీకరించారు. పాత రికార్డుల్లోని ఓ నేరస్థుని వేలి ముద్రలతో సరిపోలగా ప్రత్యేక దర్యాప్తు బృందాలు నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగాయి. చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారికి సహకరించిన మరొకరు పరారీలో ఉన్నారు. వీరి నుంచి 61 తులాల బంగారు ఆభరణాలు, రూ. 2 లక్షల 80వేల నగదు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

వేలిముద్రల ఆధారంగా...

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వేలిముద్రల సమాచారం ఆధారంగా భారీ చోరీని ఛేదించగలిగామని మహబూబ్​నగర్ ఎస్పీ రెమారాజేశ్వరి వెల్లడించారు. అందుకు దోహద పడిన దర్యాప్తు, టెక్నాలజీ, సీసీఎస్ బృందాలను ఆమె అభినందించారు.

నిందితులను ప్రవేశపెట్టిన ఎస్పీ

విలాసవంతమైన జీవితం కోసం...

ఈ కేసులో ప్రధాన నిందితులైన అంగడి సురేశ్​, మురళీకృష్ణ పాత నేరస్థులు. వీరిపై వివిధ జిల్లాల్లో ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. గతంలో జైలుశిక్ష సైతం అనుభించారు. పీడీ యాక్ట్​ కూడా గతంలో వీరిపై నమోదైంది. జైలు నుంచి తిరిగొచ్చాక విలాసవంతమైన జీవితం కోసం మరోసారి దొంగతనానికి పాల్పడేందుకు పథకం పన్నారు.

టార్గెట్ బోయినిపల్లి...

నిందితులు ఈనెల 18న చోరీలు చేసేందుకు మిడ్జిల్ మండలం బోయినిపల్లిని ఎంచుకున్నారు. హయత్​నగర్ మండలం తొర్రూర్ గ్రామంలోని రాజీవ్ గృహకల్ప నుంచి పీరయ్య ఆటో తీసుకుని బోయినిపల్లి చేరుకున్నారు. పీరయ్యను కల్వకుర్తికి వెళ్లి ఆటోతో సిద్ధంగా ఉండాలని సూచించారు. తొలుత బోయినిపల్లిలోని ఓ ఇంట్లో రూ. 18వేల నగదు దొంగతనం చేశారు. పక్కనే మరో ఇంటిని గమనించి అక్కడా దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు.

సినిమాను తలపించే స్టోరీ...

ఇంటికి సమీపంలోని వరికోత యంత్రం టూల్​బాక్స్​ను పగలగొట్టారు. చోరీకి ఉపయోగ పడుతుందని స్క్రూడ్రైవర్​ను తమ వెంట తీసుకెళ్లారు. పక్కనే ఉన్న ఇంట్లో వెనకాల కిటికీలోంచి వంటగది తలుపు తెరిచారు. అక్కడి నుంచి పడకగదికి చేరుకుని బీరువాలోని బంగారు నగలు, నగదును అపహరించి పరారయ్యారు. మార్గ మధ్యలో మిడ్జిల్ పీఎస్ పరిధిలో ఒకటి, తలకొండపల్లి పీఎస్ పరిధిలో ఒకటి... రెండు బజాజ్ పల్సర్ బైక్​లను దొంగతనం చేశారు. చోరీ సొమ్ము, వాహనాలతో స్వస్థలాలకు చేరుకున్నారు. ఈలోపు కేసును ఛేదించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

దొంగతనాలకు పాల్పడటంలో నిందితులు ఎంతో నైపుణ్యం ఉన్న వాళ్లు. అందుకే బీరువాలో నగలు దొంగిలిస్తున్నప్పుడు ఆ గదిలో ఇద్దరు నిద్రిస్తున్నారు. అయినా గుట్టుచప్పుడు కాకుండా చోరీకి పాల్పడ్డారు. సమాచారం కోసం నిందితులు చరవాణీలు సైతం వాడలేదు.

- ఎస్పీ రెమా రాజేశ్వరి

ఇదీ చదవండి:ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీకి మరో 150 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్

ABOUT THE AUTHOR

...view details