ఎప్పుడు ఏ క్షణం.. ఎవరిపై ప్రేమ పుడుతుందో ఎవరికీ తెలియదు. బహుశా అలా తెలిసుంటే.. ఆ క్షణాన ఏ అమ్మాయి గడప దాటదు. ఒక చిత్రంలోని డైలాగ్ ఇది. కానీ, అక్షరాల సత్యం. అందుకే, ఆస్తి, అంతస్తులతో సంబంధం లేకుండా... కుల, మతాలకతీతంగా ప్రేమ ఇద్దరిని కలుపుతుంది. ఎన్నో అవరోధాలు ఎదురవుతాయని తెలిసినప్పటికీ... కలిసి బతకాలనే కోరిక వారిని ముందుండి నడిపిస్తుంది. పెద్దల్ని ఒప్పించి కొందరు పెళ్లి చేసుకుంటుంటే... ఒప్పించ లేక పారిపోయి ఒక్కటవుతున్నారు కొందరు. కానీ.. కొంతమంది మాత్రం ఆ ప్రయాణంలో అడుగులు ఎటువేయాలో తెలియక చివరకు ప్రాణాలనే అర్పిస్తున్నారు.
మీ పెద్దోళ్లున్నారే.. ఎప్పటికీ అర్థం చేసుకోరు
ప్రేమ కారణంగా దేశంలో జరుగుతున్న ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ విషయంలో 2017లో వచ్చిన ఒక అధ్యయనం ప్రకారం ప్రేమ సంబంధిత కారణాలతో 5,000మంది వరకు ఆత్మహత్యలు చేసుకున్నట్లు తేల్చారు. వన్‌సైడ్ లవ్, ప్రేమ తర్వాత తగాదాలు, బ్రేకప్‌లు, ఇలా ఎన్నో కారణాలవుతున్నాయి ఈ బలన్మరణాలకు. కానీ వారి ప్రేమ ఫలించింది అను కున్న తర్వాత.. పెద్దల్ని ఒప్పించలేక ప్రాణాలు తీసుకుంటున్న వారి విషయంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అందరిది. ప్రేమ మీద పెద్దలకు ఎందుకు నమ్మకం లేకుండా పోతుంది..? ప్రేమ పెళ్లి చేసుకుంటే ఎందుకంత ఆగ్రహిస్తున్నారు..? వారి వారి వయసుల్లో వారికి నచ్చిన ప్రేమ పిల్లల విషయానికొచ్చేసరికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు.? పిల్లల మనసుల్లో తొలుస్తున్న ప్రశ్నలివి.
ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అవాంతరాలు
జాతీయ నేర గణాంక సంస్థ అంచనాల ప్రకారం దేశంలో ప్రతి నాలుగు నిమిషాలకొకరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. కానీ కోటి ఆశలు, కొత్త ఆకాంక్షలతో ప్రపంచానికి స్వాగతం చెప్పాల్సిన యువతరం ప్రేమపేరుతో ఆ జాబితాలో చేరడమే జీర్ణించుకోలేని విషయం. కులం, మతం, ఆచారాలు, సంప్రదాయాలు, ఆర్థిక స్తోమత, ఇలా ఎన్నో కారణాలు ప్రేమజంటల్ని దిక్కుతోచని స్థితిలోకి నెడుతున్నాయి. అయితే పరువు హత్యలు, లేదంటే ఇలా ఆత్మహత్యలతో ప్రణయకావ్యాలు కాస్తా విషాదగీతాలు అవుతున్నాయి.
మీ సంతోషమే మేము కోరుకుంటాం.. కానీ..