రైలు నుంచి దూకి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం పెద్దలు కాదన్నారో.. మరి ఇంకే కారణమో ఓ ప్రేమ జంట... ప్రయాణిస్తున్న రైలు నుంచి దూకి ఆత్మహత్యాహయత్నం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా బలిజిపేట మండలం అరసాడకు చెందిన ఓ యువతి, ఇరువాడకు చెందిన నాగరాజు ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను పెద్దలు కాదన్నారో, మరి వారిద్దరి మనస్పర్థలు కారణమో తెలియదు కానీ రైలులో ప్రయాణిస్తున్న వారు నెల్లిమర్ల సమీపానికి వచ్చేసరికి రైలు నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించారు. రైలు రైల్వే స్టేషన్ సమీపానికి రావడం వల్ల వేగం తగ్గటంతో ప్రేమికులిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. రైలు పట్టాల మధ్యలో పడిఉన్న వీరిని గమనించిన ట్రాక్ సిబ్బంది... 108 వాహనం ద్వారా విజయనగరం ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.