హైదరాబాద్ హయత్‌నగర్‌కు చెందిన నాగరాజు, శ్రీలత ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకొని ఒక్కటవ్వాలని భావించారు. ఎన్నో ఆశలతో ద్విచక్రవాహనంపై నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు దేవాలయానికి బయలుదేరారు. మూడుముళ్ల బంధంతో కాసేపట్లో ఒక్కటవ్వాలనుకున్న వారిని... ప్రమాదం వెంటాడింది. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యంతో దూసుకొచ్చిన కారు... ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. మరికొన్ని వాహనాలనూ తోసుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో నాగరాజుతోపాటు మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా... నాగరాజు మృతి చెందాడు. శ్రీలతతోపాటు మిగతవారు చికిత్స పొందుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జాతీయ రహదారిపై సిగ్నల్ పడింది. కొన్ని క్షణాల్లో గ్రీన్ లైట్ వెలిగేందుకు సమయం సమీపిస్తోంది. వాహనదారులు అందరూ అప్రమత్తంగా ఉన్నారు. కొందరు యూ టర్న్ తీసుకుంటున్నారు. ప్రేమజంట ద్విచక్రవాహనం ముందున్న లారీ, కార్లు నెమ్మదిగా కదిలాయి. మిగతా వాహనాలూ ముందుకు వెళ్తున్నాయి. మెళ్లగా వేగం పెంచేందుకు ఒక్కొక్కరూ గేర్లు మారుస్తున్నారు. అంతలోనే అనుకోని ప్రమాదం కారు రూపంలో వచ్చి పడింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న వాహనదారుడు వెనకాల నుంచి అతివేగంతో దూసుకొచ్చాడు. ముందున్న వాహనాలను బలంగా ఢీ కొట్టాడు. ఆ వేగానికి ప్రమాదంలోనూ కారు ఆగలేదు.