వరుసగా జరుగుతున్న ప్రేమజంటల ఆత్మహత్యలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం వడ్ల అమృతండాలో వ్యవసాయ బావిలో పడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇరు కుటుంబాల్లో కడుపుకోతను మిగిల్చింది.
తండాకు చెందిన మోహన్... మేస్త్రీగా పని చేస్తూ... కుమారుడు ప్రశాంత్‌ను ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదివిస్తున్నాడు. ఇదే తండాకు చెందిన మంగీలాల్... వ్యవసాయం చేసుకుంటూ... జీవనం సాగిస్తున్నారు. వీరి కుమార్తె ప్రవీణ డిగ్రీ పూర్తి చేసింది. ఇరు కుటుంబాల వారు కుటుంబ స్నేహితులు.. కష్టసుఖాల్లో పాలుపంచుకునేవారు. కరోనా లాక్డౌన్ కారణంతో ఇరు కుటుంబాల పిల్లలు తండాలోని ఇంటి వద్దే ఉంటున్నారు. ప్రశాంత్, ప్రవీణలు గత కొద్ది కాలంగా చనువుగా ఉంటున్నారు. వీరి ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయలేదు.
సోమవారం వ్యవసాయ పనులకు వెళ్లి ఇంటికి వచ్చే వరకు ప్రశాంత్, ప్రవీణలు ఇంటి వద్ద కనిపించలేదు. ప్రవీణ ఇంటి వద్ద పురుగుల మందు డబ్బా మూత తీసి ఉండడం.... కొంత మందు కింద పోయి ఉన్న దృశ్యం కనపడింది. దీంతో ఇరువురు పురుగుల మందు తాగి ఉంటారని అనుమానించి తండా పరిసర ప్రాంతాలు, బంధు మిత్రుల ఇల్లు గాలించారు. ఎక్కడా ఆచూకీ లభ్యం కాలేదు. వీరి ప్రేమ విషయం సోమవారం సాయంత్రం ఇంట్లో తెలిసింది. దీంతో భయాందోళనకు గురైన ప్రేమజంట సోమవారం సాయంత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్లారు.
తండా శివారులోని వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ఉదయం అటువైపుగా వెళ్తున్న రైతులు బావిలో శవాలు పడి ఉండటాన్ని చూసి తండావాసులకు సమాచారం అందించారు. తండా వాసులంతా ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా.. తమ తండాకు చెందిన వారేనని గుర్తించారు. బంధుమిత్రులు... తండావాసుల రోదనలతో తండాలో విషాద ఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న గార్ల ఎస్ఐ రవి ఘటనా స్థలానికి చేరుకుని... ప్రవీణ తండ్రి ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టారు. చిన్నారులు.... మైనర్లు ప్రేమ మైకంలో పడి క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుని.. అర్ధాంతరంగా తనువు చాలిస్తూ... తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిలిస్తున్నారని ఈ విధంగా చేయవద్దని పలువురు యువతకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి:పెద్దలకు తెలిసిన ప్రేమ.. బావిలో దూకి జంట ఆత్మహత్య