ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఓ యువకుడు... తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు ఇక లేదని తెలిసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గోవిందుపల్లెకు చెందిన లింగంపల్లి అనూష, లక్ష్మీపూర్‌కు చెందిన మానాల రాకేశ్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. జీవనోపాధి కోసం రాకేశ్... దుబాయ్‌కు వెళ్లాడు.
ఊర్లో ప్రియురాలు, దుబాయ్‌లో ప్రియుడు ఆత్మహత్య - ప్రేయసి చనిపోయిందని ప్రియుడు ఆత్మహత్య
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఉపాధి కోసం అబ్బాయి దూర దేశాలకు వెళ్లాడు. అమ్మాయి ఊర్లోనే ఉంది. తమ భవిష్యతు గురించి ఇద్దరూ ఎన్నో కలలు కన్నారు. ఇద్దరి మధ్య దూరమెంతున్న వారి మనుసులు మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉన్నాయి. అంతా బానే ఉందనుకునే సమయంలో... ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. తనను విడిచి వెళ్లిన ప్రియురాలిని తలుచుకుంటూ... ఆ ప్రేమికుడూ... తనువు చాలించాడు. అసలు ఏం జరిగింది.. ఎందుకు వాళ్లు ఈ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు..?
ఈ క్రమంలో వీరిద్దరి విషయం అమ్మాయి ఇంట్లో తెలిసింది. తమ ప్రేమను ఇంట్లో ఒప్పుకోరనే భయంతో అనూష... శుక్రవారం రోజు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం దుబాయిలో ఉన్న రాకేశ్‌కు సన్నితుల ద్వారా తెలిసి గుండె పగిలేలా రోధించాడు. అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకుని... ఎంతో సుఖంగా చూసుకుందామనుకుని ఎన్నో కలలు కన్న తనను వదలిసి వెళ్లిపోయిన ప్రేయసిని తలచుకుని వెక్కివెక్కి ఏడ్చాడు. తన ప్రేయసి లేని లోకంలో తానూ ఉండలేనని భావించి... అదే రోజు సాయంత్రం రాకేశ్ కూడా దుబాయ్‌లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కన్నీరు పెట్టించిన వేదన...
ఆత్మహత్యకు ముందు తన మనోవేదనను సెల్ఫీ వీడియోలో వ్యక్తపరిచాడు. కనీపెంచిన అమ్మను వదిలివెళ్తున్న బాధ ఓ వైపు... ప్రేమించిన అమ్మాయి లేని లోకంలో ఉండలేననే వేదన మరోవైపు... వ్యక్తపర్చిన ఈ వీడియో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. అమ్మాయి తొందరపాటు నిర్ణయం ఇరుకుంటుబాలను శోకసంద్రంలో మునిగేలా చేసిందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.