తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అనర్హులకు కల్యాణలక్ష్మి... 111 మంది బినామీ పేర్లతో దరఖాస్తులు - kalyana lakshmi latest news

ఆదిలాబాద్‌ జిల్లాలో కల్యాణలక్ష్మి అక్రమాలు బహిర్గతమవుతున్నాయి. ఆరు మండలాల పరిధిలో 111 మంది బినామీ వ్యక్తులు నకిలీ ధ్రువపత్రాలతో పథకానికి అర్హత పొందినట్లు అధికారులు గుర్తించారు. 87 మంది ఖాతాల్లో నగదు జమ అయింది. ఈ అక్రమాల్లో అసలు మధ్యవర్తుల కోసం జిల్లా రెవెన్యూశాఖ ఆరాతీస్తోంది.

kalyanalaxmi
kalyanalaxmi

By

Published : Nov 24, 2020, 8:04 AM IST

అనర్హులకు కల్యాణలక్ష్మి... 111 మంది బినామీ పేర్లతో దరఖాస్తులు

పేదల ఇళ్లలో ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదని ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం ఆదిలాబాద్ జిల్లాలో పక్కదారి పడుతోంది. బినామీల పేరిట అక్రమార్కులు కల్యాణలక్ష్మి నిధులు స్వాహా చేస్తున్నారు. ఆదిలాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని బజార్‌హత్నూర్‌ మండలంలో 32 మంది, నేరడిగొండ మండలంలో 31 మంది, బోథ్‌ మండలంలో 30 మంది, గుడిహత్నూర్‌ మండలంలో 15 మంది, మావల మండలంలో మరో ముగ్గురికి బినామీ పత్రాలతో కళ్యాణలక్ష్మి నిధులు మంజూరైనట్లు తేలింది. ఇందులో బోథ్‌లో 21మంది, మావలలో ముగ్గురు వ్యక్తులు మినహా మిగిలిన 87 మంది లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అయినట్లు విచారణలో తేలింది.

గుట్టు చప్పుడు కాకుండా

గ్రామస్థాయి రెవెన్యూ సిబ్బంది మొదలుకొని శాసనసభ్యుల ఆమోదంతో మంజూరుకావాల్సిన నిధులు గుట్టుచప్పుడు కాకుండా అక్రమార్కుల ఖాతాల్లో జమ కావడం అధికారవర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అప్రమత్తమైన అధికారులు... మండలాల వారీగా కల్యాణలక్ష్మి జాబితాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

ఇచ్చోడ మీసేవా కేంద్రంగా

కల్యాణలక్ష్మి అక్రమాలు ఇచ్చోడ మీసేవా కేంద్రంగానే జరిగినట్లుగా అధికారులు ప్రాథమికంగా నిర్ధరించారు. ఇందులో అసలు మధ్యవర్తులెవరనే అంశంపై విచారణ చేపడుతున్నారు. ఆదిలాబాద్‌ ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తూ.. ఇదే కేసులో సస్పెన్షన్‌కు గురై పరారీలో ఉన్న నదీం ఆచూకీ ఇంకా లభించలేదు. ఈ వ్యవహారంలో ఇచ్చోడ మీసేవా కేంద్రం నిర్వాహకులైన అచ్యుత్‌ , శ్రీనివాస్‌ జాదవ్‌లనూ పోలీసులు విచారించనున్నారు.

నాయకుల పాత్రపై అంతర్గత విచారణ

ఇప్పటికే ఓ హత్య కేసులో నిందితులుగా ఉన్న వీరిద్దరికీ... మూడు రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. మధ్యవర్తుల వివరాలతో పాటు బ్యాంకు ఖాతాలు, లావాదేవీలు జరిపిన వివరాలు తెలుసుకునేందుకు మండలాల వారీగా జాబితాలు సిద్ధం చేస్తున్నారు. ప్రాథమికంగా తేలిన అక్రమాలన్నీ ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ మాసంలో జరిగినట్లుగా గుర్తించారు. సిబ్బంది, రాజకీయ నాయకుల పాత్రపై అంతర్గత విచారణ చేపడుతున్నారు.

ఇదీ చదవండి :చేతబడి చేయించాడనే అనుమానంతో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ హత్య

ABOUT THE AUTHOR

...view details