కడంబా అడవుల్లో కూంబింగ్... మావోయిస్టు కీలక నేత కోసం గాలింపు - kadamba encounter news
14:21 September 20
కడంబా అడవుల్లో కూంబింగ్... మావోయిస్టు కీలక నేత కోసం గాలింపు
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కడంబా అటవీప్రాంతంలో శనివారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టుల్లో ఒకరిని పోలీసులు గుర్తించారు. మరొక మావోయిస్టు వివరాల కోసం ఆరాతీస్తున్నారు. మరోపక్క తప్పించుకున్న మావోయిస్టు కీలక నేత మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ కోసం ముమ్మర కూంబింగ్ జరుగుతోంది.
ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఇంఛార్జి ఎస్పీ సత్యానారాయణతో పాటు మంచిర్యాల ఓఎస్టీ ఉదయ్‌కుమార్‌రెడ్డి సందర్శించారు. మృతి చెందిన ఇద్దరు మావోయిస్టుల్లో ఒకరు ఛత్తీస్‌గడ్‌లోని భీజాపూర్‌కు చెందిన చుక్కాలుగా గుర్తించారు. మరొక మావోయిస్టు వివరాల కోసం పోలీసులు ఆరాతీస్తున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఓ 9 ఎంఎం పిస్టోల్‌తో పాటు మరో తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కడంబ గ్రామానికి దాదాపుగా ఏడు కిలోమీటర్ల దూరంలో రహాదారిపక్కనే ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టు కీలకనేత అయిన మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ మరోసారి తప్పించుకున్నట్లుగా పేర్కొన్న ఇంఛార్జి ఎస్పీ సత్యానారాయణ.... అటవీప్రాంతంలో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
దాదాపుగా దశాబ్ధం తర్వాత కాగజ్‌నగర్ అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య మళ్లీ ఘర్షణాత్మక వాతావరణం నెలకొనడం వల్ల ప్రజల్లో భయాందోళనలు రేకెత్తుతున్నాయి. గతంలో మావోయిస్టు అగ్రనేత చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్ సహా జర్నలిస్టు హేమచంద్ర పాండే ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన తరువాత మళ్లీ ఇలాంటి ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.