రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ గ్రామీణ జిల్లా గొర్రెకుంట మృత్యుబావి కేసులో ఇవాళ తీర్పు వెలువడనుంది. బిహార్‌కు చెందిన నిందితుడు సంజయ్‌కుమార్.. మత్తు మందు కలిపిన ఆహారం ఇచ్చి తొమ్మిది మందిని జలసమాధి చేశాడు. ఈ కేసులో ఇప్పటికే విచారణ పూర్తయింది. మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఇవాళ తీర్పివ్వనున్నారు.
వరంగల్ గ్రామీణ జిల్లా గొర్రెకుంట శివారులోని పాడుబడ్డ బావిలో తొమ్మిది మృతదేహాలు వెలుగుచూసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మే 20న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బంగా నుంచి 20 ఏళ్ల క్రితమే వచ్చి వరంగల్‌లో స్థిరపడిన మక్సూద్ కుటుంబ సభ్యులు దారుణహత్యకు గురయ్యారు. మక్సూద్ ఇంటిపక్కనే నివాసముండే ఇద్దరు బిహారి యువకులు కూడా విగత జీవులుగా బావిలో తేలారు. తొలుత ఆత్మహత్యలుగా భావించిన పోలీసులు.. అనంతరం వాటిని హత్యలుగా నిర్ధరించారు.
టాస్క్‌ఫోర్స్, సీసీఎస్, క్లూస్‌టీం, సాంకేతిక బృందం.. ఇలా 6 బృందాలతో రాత్రింబవళ్లు దర్యాప్తు చేసి 72 గంటల్లోనే కేసు మిస్టరీని ఛేదించారు. బిహార్‌కు చెందిన సంజయ్‌కుమార్ యాదవ్ హత్యలు చేసినట్లు నిర్ధరించిన పోలీసులు.. అనంతరం అరెస్ట్ చేశారు. ఒక హత్యను కప్పిపుచ్చుకోవడానికి.. 9 మందిని హతమార్చినట్లు పోలీసులు విచారణలో తేలింది.