తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఆదిలాబాద్​ కాల్పుల ఘటనలో గాయపడిన జమీర్ మృతి

ఆదిలాబాద్‌లో కలకలం సృష్టించిన కాల్పుల ఘటనలో గాయపడిన సయ్యద్ జమీర్ మృతి చెందాడు. హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశాడు. ఈనెల 18న మజ్లిస్ నేత పారూఖ్ అహ్మద్ జమీర్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జమీర్​ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​కు తరలించినా ప్రాణాలు దక్కలేదు.

ఆదిలాబాద్​ కాల్పుల ఘటనలో గాయపడిన జమీర్ మృతి
ఆదిలాబాద్​ కాల్పుల ఘటనలో గాయపడిన జమీర్ మృతి

By

Published : Dec 26, 2020, 8:39 PM IST

ఆదిలాబాద్ తాటిగూడలో వారం క్రితం.. ఎంఐఎం నేత, మాజీ జిల్లా అధ్యక్షుడు ఫారూఖ్ అహ్మద్ తుపాకీ, కత్తితో వీరంగం సృష్టించాడు. పాతకక్షలతో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కాల్పులకు దారితీసింది. మజ్లిస్ జిల్లా అధ్యక్షుడు ఫారూక్ అహ్మద్... ప్రత్యర్థి వర్గానికి చెందిన ఇద్దరిపై కాల్పులు జరపడంతో పాటు మరొకరిపై తల్వార్‌తో దాడిచేశాడు. కాల్పుల ఘటనలో జమీర్, మోతేషాన్ క్షతగాత్రులవ్వగా.. మన్నన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. జమీర్‌ను నిమ్స్ కు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

ఇరువర్గాల నడుమ తరచూ గొడవలు..

గత మున్సిపల్ ఎన్నికల్లో మజ్లిస్ తరపున ఫారూఖ్ భార్య బరిలో నిలవగా.. తెరాస తరపున జమీల్ బంధువు వసీం భార్య పోటీచేశారు. ఫారూఖ్ భార్య గెలవగా.. వసీం వర్గం ఓటమి పాలైంది. అప్పటి నుంచి ఇరువర్గాల నడుమ తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో పిల్లలు క్రికెట్ ఆడటంతో.. మాటామాటా పెరిగి కాల్పులకు దారితీసింది. తొలుత పరస్పరం దాడులకు దిగిన క్రమంలో సహనం కోల్పోయిన మజ్లిస్ నేత ఫారూఖ్.. ఓ చేత్తో కత్తి, మరో చేత్తో తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో జమీర్‌ శరీరంలోకి రెండు తూటాలు.. మన్నన్ , మోతేషాన్ శరీరాల్లో ఒక్కో తూటా దిగింది. కుప్పకూలిన ఆ ముగ్గురిని స్థానికులు హుటాహుటినా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఫారూఖ్‌ను వెంటనే అదుపులోకి తీసుకొని టూటౌన్ ఠాణాకి తరలించారు. ఆయన వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకుని రిమాండ్​కు తరలించారు.

దిద్దుబాటు చర్యలు..

ప్రశాంతంగా ఉన్న ఆదిలాబాద్.. కాల్పుల ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాల్పుల ఘటనతో మజ్లిస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తుపాకీతో రెచ్చిపోయిన ఫారూఖ్ అహ్మద్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. జమీర్ మృతితో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తాటిగూడలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత కథనం:భగ్గుమన్న పాతకక్షలు... వీధిలోనే పేలిన తూటాలు

ABOUT THE AUTHOR

...view details