ప్రజా భద్రతలో సీసీ కెమెరాలు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. ప్రజలంతా స్వచ్ఛందంగా నేను సైతంతో కలిసి రావాలని ఆయన సూచించారు. మహారాష్ట్రకు చెందిన గొలుసు దొంగ శంకర్రావును అరెస్టు చేసి.. 5.5 తులాల బంగారు ఆభరణాలు, ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు.
ఈ దొంగపై మహరాష్ట్రలో 47 గొలుసు దొంగతనాలు - హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తాజా వార్తలు
గొలుసు దొంగతనాలకు పాల్పడుతోన్న అంతర్రాష్ట్ర దొంగను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని వద్ద నుంచి 5.5 తులాల బంగారు ఆభరణాలు, ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.
శంకర్రావు నగరంలో రెండు గొలుసు దొంగతనాలు చేసినట్లు సీపీ పేర్కొన్నారు.మహారాష్ట్రలో ఇతనిపై 47 కేసులు ఉన్నాయని.. అక్కడ జైలు నుంచి విడుదలై హైదరాబాద్లో చోరీలు ప్రారంభించాడని తెలిపారు. మొదట ఓ ద్విచక్ర వాహనం చోరీ చేసి, అదే వాహనంపై రెక్కీ చేసి ఒంటరిగా వెళుతున్న మహిళల మెడలో నుంచి గొలుసులు లాక్కెళ్లడం ఇతని నైజమని వివరించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశామన్న ఆయన.. కేసులను ఛేదించటంలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని అన్నారు. వీటి వినియోగంలో ప్రపంచంలోనే హైదరాబాద్ 16వ స్థానంలో ఉండటం గర్వించదగ్గ విషయమని తెలిపారు.
ఇదీచూడండి: స్నేహానికి గుర్తుగా గిఫ్ట్ పంపించానని లక్షలు లాగేశాడు