తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కరోనా వ్యాక్సిన్ పేరుతో సైబర్‌ మోసానికి స్కెచ్.. హెచ్చరించిన ఇంటర్‌పోల్‌ - Interpol issues orange notices to member states on cyber scams

సైబర్​ నేరస్థుల ఆగడాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. అమాయకులే లక్ష్యంగా ఆన్​లైన్​ మోసాలకు పాల్పడుతూ వారి జేబులు గుళ్ల చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో పలు సంస్థల నుంచి కొవిడ్‌ వ్యాక్సిన్‌ రాబోతున్నట్లు తెలుస్తుండటం వల్ల నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి మోసాలకు పాల్పడే అవకాశమున్నట్లు ఇంటర్ పోల్ గుర్తించింది. ఈ మేరకు 194 సభ్య దేశాలకు తాజాగా ఆరెంజ్‌ నోటీసు పంపించింది.

Interpol warns against cyber fraudsters
సైబర్‌ మోసగాళ్లపై ఇంటర్‌పోల్‌ హెచ్చరిక.. 194 సభ్య దేశాలకు నోటీసు

By

Published : Dec 4, 2020, 7:03 AM IST

ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతూ అమాయకుల జేబులు కొల్లగొట్టే సైబర్‌ నేరస్థులు.. కరోనా భయాన్నీ సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. మరికొద్ది రోజుల్లో పలు సంస్థల నుంచి కొవిడ్‌ వ్యాక్సిన్‌ రాబోతున్నట్లు తెలుస్తుండటం వల్ల నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి మోసాలకు పాల్పడే అవకాశమున్నట్లు ఇంటర్‌పోల్‌ గుర్తించింది. ఈ మేరకు 194 సభ్య దేశాలకు తాజాగా ఆరెంజ్‌ నోటీసు (హెచ్చరిక) పంపించింది. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి.. కొవిడ్‌ వ్యాక్సిన్‌ను నేరుగా సరఫరా చేస్తామంటూ అంతర్జాలంలో ప్రకటనలు గుప్పించి మోసగించే ప్రమాదముందని నోటీసులో పేర్కొంది. ఇప్పటికే విదేశాల్లో జరిగిన మోసాలను ఉదహరించింది.

మరికొందరు సైబర్‌ నేరస్థులు ఫార్మా సంస్థలకు మాల్‌వేర్‌, ఫిషింగ్‌ లింకుల్ని పంపిస్తారని.. ఆ లింకుల్ని తెరిస్తే వైరస్‌ చొరబడి సంస్థల డేటా తస్కరణకు గురవుతుందని హెచ్చరించింది. ఆన్‌లైన్‌లో ఔషధాల్ని విక్రయించే ఫార్మా సంస్థల పేరిటా నకిలీ లింకుల్ని పంపిస్తారని.. అలాంటి వాటిపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సూచించింది.

ఇప్పటికే పలు రూపాల్లో గాలం..

కరోనా పేరిట ఇదివరకే సైబర్‌ నేరస్థులు పలు రూపాల్లో మోసాలకు పాల్పడ్డారు. కరోనా ప్రబలిన తొలినాళ్లలో బాధితుల సహాయార్థం ఆన్‌లైన్‌లో విరాళాల సేకరణకు ప్రధానమంత్రి కార్యాలయం‘పీఎం కేర్స్‌’ పేరిట నిధి ఏర్పాటు చేసింది. సైబర్‌ నేరస్థులు ఒక్క అక్షరం తేడాతో నకిలీ వెబ్‌సైట్లను సృష్టించారు. ఈ విషయం తెలియనివారు నకిలీ వెబ్‌సైట్‌ల్లోని లింకులను తెరిచి డబ్బు పంపించారు. రోగ నిరోధక శక్తి పెంచే ఔషధాలతో పాటు మాస్కులు, శానిటైజర్లు, పల్స్‌ ఆక్సిమీటర్లు తదితర సామగ్రిని తక్కువ ధరకే సరఫరా చేస్తామంటూ అంతర్జాలంలో ప్రకటనలు ఇచ్చి మోసాలకు పాల్పడ్డారు. ఇంటర్‌పోల్‌ తాజా హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. నకిలీ వెబ్‌సైట్లపై దృష్టి సారించారు.

ఇదీ చూడండి: మైక్రో ఫైనాన్స్ యాప్​ల పేరిట సైబర్‌ నేరస్థుల మోసాలు

ABOUT THE AUTHOR

...view details