తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రుణాలతో వల.. జీవితాలు విలవిల - కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా వార్తలు

నిరుద్యోగులు, యువకుల అవసరాలను పసిగట్టి ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా వడ్డీకి రుణాలు ఇచ్చి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. ఆ ఊబిలో చిక్కుకున్న కొందరు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో తీసుకున్న రుణం రెండింతలు అవుతుంది. ఈ సమయంలో డబ్బును చెల్లించాలని లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరింపు సందేశాలు పంపుతూ బాధితులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ విధమైన యాప్‌లు 20కు పైగా ఉన్నట్లు తెలుస్తోంది.

instant loan app fraud case registerd in kumarambheem asifabad district
రుణాలతో వల.. జీవితాలు విలవిల

By

Published : Jan 3, 2021, 12:23 PM IST

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా బూరుగూడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన అవసరాల కోసం డిసెంబరు 06, 2020లో ఆన్‌లైన్‌ రుణం కోసం దరఖాస్తు చేసుకుని రూ.5 వేలు పొందాడు. దీనికి వడ్డీ రూ.490, ప్రాసెసింగ్‌ ఫీజు రూ.1750, జీఎస్టీ 315 వెరసి వారానికి రూ.7490 చెల్లించాలి. అతను ఈ మొత్తాన్ని చెల్లించకపోవడంతో వారం రోజుల తరువాత రోజుకు రూ.200 చొప్పున వడ్డీ వేస్తూ రూ.20 వేలు చెల్లించాలని లేకుంటే సమీప పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ 420, 421 కేసులు నమోదు చేస్తామంటూ బెదిరింపు ఫోన్లు చేశారు. రుణం పొందే సమయంలో ఇతడు తన వ్యక్తిగత సమాచారాన్ని వారికి ఇచ్చాడు.

*ఆసిఫాబాద్‌ పట్టణానికి చెందిన వ్యక్తి రూ.12 వేలు రుణాన్ని తీసుకున్నాడు. చెల్లించే సమయంలో పదిశాతానికి పైగానే వడ్డీ చెల్లిస్తున్నానని గ్రహించాడు. తీసుకున్న రూ.12 వేలకు నెలకు రూ.1600 వడ్డీ చెల్లించాడు. బయట వ్యాపారుల వద్ద మూడు శాతం వడ్డీ వేస్తారు. మరోసారి రుణం తీసుకోకూడదని నిర్ణయించుకున్నాడు.

వ్యక్తిగత సమాచారం వారి చేతుల్లో..

రుణ సంస్థల యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని రుణం కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో వ్యక్తిగత సమాచారం అడుగుతారు. ఆ సమయంలో మన మొబైల్‌ నంబరు ఇస్తాం. ఆ తరువాత వారు అడిగిన ప్రతి దానికి అలోవ్‌ అంటూ నొక్కడంతో మన డాటా అంత వారి చేతుల్లోకి వెళ్తుంది. మన చరవాణిలో ఉన్న కాంటాక్టు డేటాతో పాటు, ఫొటోలు వ్యక్తిగత సమాచారం వారి దగ్గరకు చేరుతుంది. ఒకవేళ రుణం చెల్లించేటప్పుడు ఆలస్యమైతే తమ బంధువులకు, స్నేహితులకు ఈ సమాచారం పంపి కించపరుస్తారు. ఆ తరువాత బెదిరిస్తూ... కేసులు పెడతామంటున్నారు. ఇలాంటి సంఘటనతో సిద్దిపేటలో ఏఈవో ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే.

పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి

యాప్‌ల ద్వారా తక్షణం రుణాలిచ్చే సంస్థల్లో 90 శాతం వాటికి ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌ ఉండదని ఎస్​హెచ్​వో ఆకుల అశోక్‌ తెలిపారు. ఇలాంటి వారు రుణాలిచ్చి బెదిరింపులకు పాల్పడితే పోలీసులను ఆశ్రయించవచ్చని... రుణం చెల్లించకపోయిన భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించారు.

ఇదీ చూడండి:కొలువుల పేరుతో యువతకు వల

ABOUT THE AUTHOR

...view details