వికారాబాద్‌లో కల్తీ కల్లు తాగి ఒకరు మరణించారు. 212 మంది అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న 79 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. కల్లులో మత్తు పదార్థాలు కలపటమే కారణమని తెలుస్తోంది. వికారాబాద్, నవాబ్ పేట్ మండలాల్లోని 18 గ్రామాల్లో నలుగురు గుత్తేదారులు కల్లు వ్యాపారం నిర్వహిస్తున్నారు. నవాబ్ పేట మండలంలోని చిట్టిగిద్దలో డిపో ఏర్పాటు చేసుకొని కల్లు తయారు చేస్తున్నారు. అక్కడి నుంచి డీసీఎంలు, ఆటోల్లో ఇతర గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. కర్ణాటక నుంచి ఆల్పాజోలం, క్లోరోఫామ్ వంటి మత్తుమందులు తెచ్చి కలుపుతున్నారు. ఆ కల్లు తాగటం వల్ల మెదడు, నరాల వ్యవస్థ దెబ్బ తింటుందని వైద్యులు తెలిపారు. అలవాటు పడితే ఒక్క రోజు కల్లు లేకపోయినా... పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, మూర్ఛ రావటం వంటి లక్షణాలు బయటపడతాయని వివరించారు.
కల్లు వ్యాపారులతో చేతులు కలిపి...
రెండేళ్ల క్రితం తాండూరుతోపాటు పరిసర గ్రామాల్లో..... కల్తీకల్లు తాగి ముగ్గురు చనిపోయారు. వంద మందికిపైగా అనారోగ్యం పాలయ్యారు. అబ్కారీ శాఖ అధికారులు కల్లు వ్యాపారులతో చేతులు కలిపి... వారిని వదిలేస్తున్నారని ఆరోపణలున్నాయి. రాజకీయ ఒత్తిడి కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని విమర్శలున్నాయి. ఇక వికారాబాద్, నవాబ్ పేట మండలాల్లో కల్తీకల్లు బాధితుల సంఖ్య పెరగడంతో అధికారులు రంగంలోకి దిగారు. చిట్టిగిద్దలో కల్లు డిపోను జప్తు చేశారు. 12 గ్రామాల్లో నమూనాలు సేకరించి ల్యాబ్ పంపించినట్లు వికారాబాద్ ఆబ్కారీ శాఖ పర్యవేక్షకుడు వరప్రసాద్ తెలిపారు.