ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం లింగగూడెం రాష్ట్ర సరిహద్దు వద్ద వాహనాల తనిఖీల్లో రూ. 5 లక్షల విలువ చేసే 557 తెలంగాణ మద్యం సీసాలను గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి వివరాలను జిల్లా ఎస్పీ నారాయణనాయక్ జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్ వద్ద వెల్లడించారు. తెలంగాణలోని సత్తుపల్లి మండలం గంగారం నుంచి రెండు కార్లల్లో మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తమై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. లింగగూడెం చెక్‌పోస్టు వద్ద వేగంగా వెళ్తున్న రెండు కార్లను ఆపి, తనిఖీ చేశారు.
ముందు వెళ్తున్న పైలెట్ వాహనంలో కృష్ణా జిల్లా బంటుమిల్లి స్పెషల్ ఎన్‌ఫోర్సుమెంటు బ్యూరో స్టేషన్ సీఐ పులి హనుశ్రీ, ఆమె డ్రైవర్ ఉండగా.. మరో వాహనంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పని చేస్తున్న ఎస్సై (వీఆర్) ఎం.విజయ్‌కుమార్, ఏలూరుకు చెందిన నున్న కమల్‌సంతోష్‌లు ఉన్నారు. విజయ్‌కుమార్ ఉన్న వాహనంలో మద్యం సీసాలను గుర్తించారు. ఈ సమయంలో సీఐ హనుశ్రీ వాహనం నుంచి కిందకు దిగగా.. డ్రైవర్ నాగరాజు కారుతో సహా పరారీ అయ్యాడు. నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలిస్తున్నామన్నారు.ఎస్సై విజయ్‌కుమార్ ను సస్పెండ్ చేసినట్లు డీఐజీ మోహనరావు గురువారం రాత్రి తెలిపారు.