అమీన్పూర్ అనాథాశ్రమానికి చెందిన బాలిక మృతి కేసులో... మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ గడువు మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం ఉంది. నలుగురు సభ్యులు గల ఈ కమిటీ పూర్తిస్థాయి విచారణ జరిపి 20వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశించారు. కమిటీ సభ్యులు ఇప్పటికే పోలీసుల, భరోసా కేంద్రం, బాలికల సంరక్షణ కేంద్రం నుంచి వివరాలు సేకరించారు. మారుతి హోంని సందర్శించి అక్కడ చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించిన సమాచారం తెలుసుకున్నారు.
అమీన్పూర్ ఘటనలో హైపవర్ కమిటీ గడువు పెంపు! - హైపర్ కమిటీ గడువు పెంచే అవకాశం
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ అనాథాశ్రమంలో బాలికపై అత్యాచారం కేసులో... ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ మరికొన్ని రోజులు గడువు పొడిగించమని కోరే అవకాశం కనిపిస్తోంది. పోస్టుమార్టం నివేదిక వచ్చేందుకు సమయం పట్టనున్నందున ఆలస్యం కానుంది.
బాలిక పోస్టుమార్టం నివేదిక ఉస్మానియా ఆస్పత్రి నుంచి రావాల్సి ఉంది. దీనికి మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదికలోనే తెలిసే అవకాశం ఉండడం వల్ల కమిటీ సభ్యులు నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత ఈ ఘటనలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నందున... గడువు కోరనున్నారు.
పటాన్చెరు పోలీసులు నిందితులను రెండురోజుల కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. దానికి సంబంధించిన సమాచారం కూడా ఇవ్వాలని కమిటీ సభ్యులు పోలీసులను కోరారు. పోలీసుల నుంచి సమాచారం వచ్చాక దాన్ని కూడా నివేదికలో పొందుపర్చనున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత దాన్ని పరిశీలించి పూర్తి స్థాయి నివేదికను హైపవర్ కమిటీ అందించే అవకాశం ఉంది.