ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని అడిగిన వివరాలు సమర్పిస్తే చాలు స్వల్ప రుణం మంజూరవుతోంది. దరఖాస్తు చేసుకున్న వ్యక్తి వివరాలను బట్టి ఆన్లైన్ రుణ సంస్థలు 2 నుంచి 10వేల రూపాయల వరకు సులభంగా రుణాలు ఇస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా వసూలు చేసేటప్పుడు మాత్రం నిర్వాహకులు రుణగ్రహీతల రక్తం తాగుతున్నారు. తీసుకున్న రుణానికి 20 శాతం వడ్డీ లెక్కించి వసూలు చేస్తున్నారు. సకాలంలో చెల్లించని వాళ్లకు 60శాతం వరకు కూడా వడ్డీ విధిస్తున్నారు. చెల్లించని వాళ్లను నోటికొచ్చినట్లు దూషిస్తున్నారు. అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఈ తరహా కేసులు 16 నమోదయ్యాయి. రోజు పదుల సంఖ్యలో ఫిర్యాదులొస్తున్నాయి.
40వేల కాల్స్
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైం పోలీసులు 11మందిని అరెస్ట్ చేశారు. వీరిలో గురుగావ్‌కు చెందిన ఐదుగురు, హైదరాబాద్‌కు చెందిన ఆరుగురు ఉన్నారు. గురుగావ్‌లోని రెండు కాల్ సెంటర్లలో 500 మంది, హైదరాబాద్‌లోని మూడు కాల్ సెంటర్లలో 600 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో ఒక్కో ఉద్యోగి రోజుకు 60 నుంచి 80 ఫోన్లు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒక్కో కాల్ సెంటర్ నుంచి దాదాపు 40వేలకు పైగా ఫోన్లు వెళ్తున్నాయి. రుణం తీసుకున్న వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేయించడమే ఈ కాల్ సెంటర్ల లక్ష్యం. బెంగళూర్‌లో రిజిస్టర్ అయిన లియోఫాంగ్ టెక్నాలజీస్, హాట్ ఫుల్ టెక్నాలజీస్, పిన్ ప్రింట్ టెక్నాలజీస్, నబ్లూమ్ టెక్నాలజీస్ కాల్ సెంటర్ల నుంచి 16 ఆన్లైన్ రుణ సంస్థలకు చెందిన వసూళ్లను పర్యవేక్షిస్తున్నారు.
చైనీయుల పెట్టుబడి
ఆన్లైన్ రుణ సంస్థల్లో చైనీయులు పెట్టుబడి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సులభంగా రుణం ఇచ్చి భారీగా వడ్డీ వసూలు చేసి... ఆ డబ్బును పలు రూపాల్లో చైనా తరలిస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్‌లోని మూడు కాల్ సెంటర్లలో పోలీసులు దాడులు చేసి నిర్వాహకులను ప్రశ్నించడంతో... చైనాకు చెందిన వ్యక్తి రెండు నెలల క్రితం కాల్ సెంటర్లకు వచ్చి పర్యవేక్షించి వెళ్లినట్లు తేలింది. గురుగావ్‌లోని కాల్ సెంటర్లలో తనిఖీ చేసినప్పుడు ఓ చైనా వ్యక్తి పాస్ పోర్టు జిరాక్స్ దొరకడం పోలీసుల అనుమానాలకు బలం చేకూర్చుతోంది.
డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి
ఆన్లైన్ కలర్ గేమింగ్ మోసంలోనూ చైనీయులు వెనక ఉండి కథ నడిపించారు. దిల్లీకి చెందిన వ్యక్తులను డైరెక్టర్లుగా ఉంచి ఈకామర్స్ పేరుతో పలు సంస్థలు స్థాపించారు. వాటి వెనుక ఆన్ లైన్ కలర్ గేమింగ్ నిర్వహించారు. దాదాపు 1,500 కోట్ల రూపాయల మోసాలకు పాల్పడి... హాంకాంగ్ మీదుగా చైనాకు డబ్బులు తరలించారు. ఈ కేసులో చైనీయుడితో పాటు.... దిల్లీకి చెందిన ఇద్దరు, గుజరాత్‌కు చెందిన వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వందల సంఖ్యలో ఉన్న ఆన్లైన్ రుణ సంస్థల్లోనూ ఎక్కువ మేరకు చైనాకు చెందినవే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే 10 బ్యాంకు ఖాతాలు, 80 వరకు యూపీఐ వాలెట్లను సీజ్ చేశారు. వీటిని పరిశీలించడం ద్వారా వీళ్లకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.