రాయదుర్గం పోలీస్టేషన్ పరిధిలోని బీఎన్ఆర్ హిల్స్‌లో బోర్వెల్ కాంట్రాక్టర్ మధుసూదన్ రెడ్డి ఇంట్లో పనిచేస్తున్న నేపాల్‌కి చెందిన నలుగురు వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. నేపాల్‌కు చెందిన రాజేందర్ అలియాస్ రవి, అతని మేనకోడలు సీతతో పాటు మరొక ఇద్దరు కొంతకాలంగా మధుసూదన్ ఇంట్లో పని చేస్తున్నారు. 15 రోజుల క్రితం జానకి, మనోజ్ కొత్తగా పనిలోకి చేరారు. నమ్మకంగా పని చేస్తూనే... ఇంట్లో డబ్బు, నగలపై కన్నేశారు. చోరీకి పథకం వేశారు. రాత్రి భోజనానికి వండిన పదార్థాల్లో మత్తుమందు కలిపారు. అవి తిన్న మధుసూదన్ రెడ్డి, అతని కుమారుడు నితీశ్ రెడ్డి, కోడలు దీప్తి, మనుమడు అయాన్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. మధూసూదన్ రెడ్డి భార్య రాత్రి చపాతి మాత్రమే తినటం వల్ల ఆమె సాధారణ నిద్రలోనే ఉన్నారు.
పథకం ప్రకారం ఇంట్లో ఉన్న 15 లక్షల నగదుతో పాటు, దీప్తి మెడలో ఉన్న బంగారు గొలుసును నేపాల్ గ్యాంగ్ ఎత్తుకెళ్లింది. ఎలాంటి ఆధారం దొరకకుండా సీసీటీవీ కెమెరా డీవీఆర్‌ను, బాధితుల చరవాణులు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేపాల్ ముఠా కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. రాయదుర్గం పోలీసులతో పాటు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు బృందాలు ఏర్పడి నిందితుల కోసం వేట సాగిస్తున్నారు.