నేరాలు నియంత్రించేందుకు హైదరాబాద్ పోలీసులు విస్త్రుతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాత్రివేళల్లో ట్రాఫిక్, శాంతిభద్రతల పోలీసులు వేర్వేరుగా తనిఖీలు నిర్వహించి అనుమానితులు, అపరిచితుల వేలిముద్రలను సేకరిస్తున్నారు. నేరస్థులనే అనుమానం రాగానే పాపిలాన్ ద్వారా అప్పటికప్పుడే తనిఖీలు చేసి ఆధార్ సర్వర్‌తో సరిపోల్చుతున్నారు. ఇలా రోజుకు సుమారు 400 మంది నుంచి ఇలాంటి వివరాలను సేకరిస్తున్నారు. పాపిలాన్ యంత్రాన్ని ఉపయోగించడం ద్వారా పశ్చిమ, దక్షిణ మండలాల్లో నమోదైన కొన్ని కేసుల్లో నిందితులను అరెస్ట్ చేశారు కూడా. భవిష్యత్తులో ఈ విధానం ద్వారా నేరనియంత్రణ సులభమవుతుందని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.
రాత్రి గస్తీ.. డ్రంకెన్ డ్రైవ్..
నగరంలో నేరనియంత్రణ, రౌడీషీటర్లు, కరడుగట్టిన నేరగాళ్లను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు రాత్రివేళల్లో కొన్ని ప్రత్యేక గల్లీలు, కాలనీలు, నేరస్థులున్న ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పాతబస్తీలోని పలు ప్రాంతాలు పశ్చిమ మండలం పరిధిలోని హుమయూన్‌నగర్, ఆసిఫ్‌నగర్, బంజారాహిల్స్, మంగళ్‌హాట్, షాహినాయత్‌గంజ్, టప్పాచబుత్ర ఠాణాల పరిధుల్లో రౌడీషీటర్లు, వారి అనుచరులను అదుపులోకి తీసుకుని తాజాగా వేలిముద్రలను సేకరించారు. దీంతోపాటు సికింద్రాబాద్, తూర్పు, మధ్యమండలం పరిధుల్లో తరచూ రాత్రివేళల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధాన ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తున్న పోలీస్ బృందాలు.. ప్రధాన రహదారులకు దారితీసే అనుసంధాన రహదారులకు వెళ్లి రాత్రి 10 గంటల తర్వాత బైక్‌లపై వస్తున్న వారిని, నడుచుకుంటూ వెళ్తున్న వారిని ఆపి వారి వివరాలు, గుర్తింపుకార్డులు అడుగుతున్నారు.