తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ దందా.. పోలీసుల పటిష్ఠ నిఘా - cannabis supply in Hyderabad by students

విద్యార్థులే లక్ష్యంగా నగరంలో మత్తు పదార్థాల దందా సాగుతోంది. మొన్నటిదాకా శివారు ప్రాంత కళాశాల విద్యార్థులకు గంజాయితో పాటు డ్రగ్స్ సరఫరా చేశారు. పోలీసుల నిఘా పెరగడం వల్ల అక్రమార్కులు పంథా మార్చి ఏకంగా విద్యార్ధులతోనే సరఫరా చేయిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా విశాఖపట్నం నుంచి నేరుగా మత్తు పదార్థాలు అవసరం ఉన్న వారికి అందిస్తున్న వైనంపై సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

Hyderabad police concentrated on drugs supply
విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ దందా

By

Published : Jan 4, 2021, 7:56 PM IST

భాగ్యనగరంలో 15 రోజులు క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదం అటు ఎక్సైజ్, ఇటు పోలీసు శాఖను కదిలించింది. డిసెంబర్ 12న మేడ్చల్ జిల్లా సూరారం కట్టమైసమ్మ గుడి మలుపు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెంది యువకుల బ్యాగులో కిలోకి పైగా గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జీడిమెట్ల నుంచి ఈ గంజాయి పార్శిల్​ను తీసుకువస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు.. వీరికి పార్శిల్ ఎవరు అందిచారనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్ధుల కాల్ డేటాలో ఎటువంటి ఆధారాలు లభ్యం కాకపోవడం వల్ల కేసులో పురోగతి సాధించ లేకపోయారు.

హషిష్ ఆయిల్ పట్టివేత

తాజాగా గంజాయితో తయారయ్యే హషిష్ ఆయిల్ సరఫరా చేస్తున్న ముగ్గురు డిగ్రీ విద్యార్ధులను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.4.80లక్షల విలువ చేసే 1.5లీటర్ల హాషిష్ ఆయిల్, 3 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. అమీర్ పేటలోని సిద్దార్థ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నట్లు గుర్తించారు.

వైజాగ్ నుంచి సరఫరా

విశాఖపట్నంలో ఉదయ్ అనే వ్యక్తి నుంచి చింతల సందీప్, షిండే సాయి చరణ్, యాప్ర నవీన్​లు నగరానికి తీసుకువస్తుండగా దిల్​సుఖ్​నగర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అవసరం ఉన్నవారికి ఈ ద్రావణాన్ని 10 మిల్లీలీటర్లు రూ.3వేలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. విశాఖపట్నం నుంచి తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు విక్రయిస్తే విలాసవంతమైన జీవితం గడపొచ్చని విద్యార్థులు ఈ దందాలోకి దిగుతున్నట్లు సరూర్ నగర్ పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. మరో కేసులో జగద్గిరిగుట్ట ప్రాంతంలో వినోద్‌ అనే విద్యార్థి నుంచి 400గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

జల్సాల కోసం

తమ పిల్లల భవిష్యత్​ బాగుండాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు వారిని ఉన్నత చదువులకోసం నగరానికి పంపిస్తే.. జల్సాలకు అలవాటు పడిన వారు డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. వీరి అవసరాన్ని ఆసరా చేసుకుని కొందరు కేటుగాళ్లు డబ్బు ఎరగా చూపి మత్తు దందాలోకి వారిని దించుతున్నారు.

ప్రత్యేక నిఘా పెట్టాం

నగరంలో చాప కింద నీరులా విస్తరిస్తున్న మత్తు దందాపై ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయని, త్వరలోనే పూర్తి స్థాయిలో వీటిని అరికడతామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. పిల్లలపై తల్లిదండ్రుల నిఘా అవసరమని.. విధిగా వారి కళాశాలకు, వసతి గృహాలకు వెళ్ళి ఆరా తీయాలని సూచించారు. పిల్లలకు విలాసవంతమైన జీవితాలను అలవాటు చేయడం వల్ల ఇటువంటి చెడు వ్యసనాలకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కళాశాల యాజమాన్యాలు కూడా విద్యార్థులపై ప్రత్యేకంగా నిఘా పెట్టేలా ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details