రాకేశ్‌రెడ్డికి అన్ని కోట్లు ఎక్కడివి?
ప్రముఖ వ్యాపారవేత్త, ప్రవాసభారతీయుడు చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. రెండో రోజు శిఖా చౌదరితో పాటు ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డి, అతనికి సహకరించిన శ్రీనివాస్‌ను విచారించారు.
హత్య జరిగిన తీరును తెలుసుకునేందుకు పోలీసులు రాకేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌ను జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్న ఇంటికి తీసుకెళ్లి పరిశీలించారు. హత్యకు ముందు చోటు చేసుకున్న ఘర్షణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాలుగున్నర కోట్ల రూపాయల డబ్బు ఇచ్చే ఆర్థిక స్తోమత లేదని రాకేశ్‌రెడ్డి చేతిలో మోసపోయిన శిఖాతోపాటు బాధితులు తెలిపారు. అసలు జయరాంకు డబ్బులు ఇచ్చారా లేదా అనేది ప్రశ్నగా మారింది. డబ్బులు ఇస్తే వాటిని ఎక్కడి నుంచి తెచ్చారనేది కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాలను పరిశీలించి.. నగదు లావాదేవీలు అంతంతమాత్రంగానే ఉన్నట్టు గుర్తించారు.
రాకేశ్‌రెడ్డి నేరచరిత్రపైనా పోలీసులు దృష్టిసారించారు. పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతల పేర్లు చెప్పి వ్యాపారులను భయపెట్టి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కూకట్పల్లి, జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్లో అతడిపై పలు కేసులు నమోదయ్యాయి. హత్యలో ఇంకెవరైనా పాల్గొన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.