వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ప్రకాశ్రెడ్డిపేటలో ఈనెల 16న సంగీత అనే వివాహిత మృతి చెందిన కేసులో కీలక విషయాలను సుబేదారి పోలీసులు వెల్లడించారు.
సంగీత మృతి తర్వాత ఆమె భర్త నాగరాజు, అతని తండ్రి బాలు పరారయ్యారని తెలిపారు. ఆదివారం సాయంత్రం డబ్బు, దుస్తులు తీసుకోవడానికి వారు ఇంటికి వెళ్లారనే సమాచారం రాగా.. అక్కడికి చేరుకున్న సుబేదారి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
సంగీతను తానే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు దర్యాప్తులో నాగరాజు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈనెల 16 అర్ధరాత్రి తన భార్యతో గొడవపడినట్లు, ఆ ఘర్షణలో చీరను ఆమె గొంతుకు బిగించి హత్య చేసినట్లు చెప్పారని వెల్లడించారు.
ప్రకాశ్రెడ్డిపేటకు చెందిన నాగరాజుకు ఈ ఏడాది మార్చి 22న కామారెడ్డి జిల్లాకు చెందిన సంగీతతో వివాహం జరిగింది. పెళ్లై నాలుగు నెలలు కూడా గడవకముందే నాగరాజు అదనపు కట్నం కోసం సంగీతను వేధింపులకు గురిచేసేవాడని, ఆ విషయంలో ఘర్షణ పడుతూనే ఆమెను నాగరాజు హత్యచేసినట్లు సుబేదారి పోలీసులు తెలిపారు. నాగరాజు అతని తండ్రి బాలును అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు.