కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటివరకు అక్రమంగా తరలుతున్న 1,283 క్వింటాళ్ల రాయితీ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని 94 మందిపై కేసులు నమోదు చేశారు. కరోనా నేపథ్యంలో రేషన్ కార్డుదారుల్లో ఒక్కొక్కరికి పది కిలోల చొప్పున ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వేలిముద్రలు లేకుండానే వీఆర్‌ఓ ధ్రువీకరణతో ఇస్తున్నారు. ఈ తరుణంలో జిల్లా మీదుగా నిత్యం పేదల బియ్యం మహారాష్ట్రకు సరఫరా కావడం పారిపాటిగా మారింది. ఈ దందాలో ఒకరికి మరొకరు పడకపోవడంతో సమాచారం అధికారుల వద్దకు వెళ్తోంది. ఈక్రమంలో అడపాదడపా చేస్తున్న దాడుల్లో నిల్వలను స్వాధీనం చేసుకుంటున్నారు.
- ‘కౌటాల మండలానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు నాలుగు రోజుల కిందట మహారాష్ట్ర నుంచి కారులో వస్తున్నారు. ఈ క్రమంలో సిర్పూర్-టి మండల సమీపంలో మహారాష్ట్రకు మినీ లారీలో తీసుకెళ్తున్న పీడీఎస్ బియ్యం చోదకుడు కారును చూసి ఎవరో అధికారులు అనుకుని వాహనాన్ని వదిలి పారిపోయాడు.’ అనంతరం సదరు నాయకుడు పోలీసులకు సమాచారమందిస్తే.. 40 క్వింటాళ్ల రాయితీ బియ్యం, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
- దహెగాం మండలంలోని కుంచవెల్లి గ్రామం వద్ద నెల రోజుల క్రితం వాహనంలో అక్రమంగా రవాణా చేస్తున్న రాయితీ బియ్యాన్ని గ్రామస్థులు రహదారి మీద నిలబడి పట్టుకున్నారు. బియ్యం సంచులు నేరుగా రేషన్‌దుకాణం నుంచే వచ్చినట్లుగా గుర్తించారు. ఇంకా సీల్ విప్పని, తెలంగాణ ప్రభుత్వ ముద్రతో సంచులు ఉండటం అక్రమాలకు పరాకాష్ఠగా నిలిచింది.
గ్రూపులుగా ఏర్పడి అక్రమాలకు..
ఇప్పటివరకు తెలంగాణకు చెందిన వాహనాల్లో మాత్రమే బియ్యాన్ని తరలిస్తుండగా.. తాజాగా మహారాష్ట్ర వాహనం సైతం (నాయకుడు పట్టించిన) వాహనం అధికారులకు లభించింది. స్థానికంగా రూ.10 లోపు కిలో రాయితీ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న దళారులు మహారాష్ట్రలో రూ.18 నుంచి రూ.20 వరకు విక్రయిస్తున్నారు. బోలేరో వాహనంలో 30 క్వింటాళ్లు తీసుకెళ్తే రూ.20 వేల వరకు, మినీవ్యాన్‌లో 60 క్వింటాళ్లు తీసుకెళ్తే రూ.45 వేల వరకు గిట్టుబాటు అవుతుంది. ఈ నేపథ్యంలో సిర్పూర్-టి, కౌటాల మండలానికి చెందిన పలువురు వ్యక్తులు గ్రూపులుగా ఏర్పడి ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇటీవలే వీరి మధ్య విబేధాలు రావడంతో పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లి పరస్పరం ఫిర్యాదులు చేసుకుని, అనంతరం రాజీపడ్డారు.
స్వల్పంగా శిక్షలు మాత్రమే ఉండటం వల్ల దళారులు మళ్లీ మళ్లీ ఈ దందాను కొనసాగిస్తున్నారు. అధికారులు 6ఏ కేసు నమోదు చేసి, జరిమానా విధిస్తున్నారు.