కరోనా తెచ్చిన లాక్డౌన్ మందుబాబులకు మేలే చేసింది. స్నేహితులంతా గుమిగూడి నిర్మానుష్య ప్రాంతాలను ఎంచుకుని మందు తాగే అడ్డాలుగా మార్చుకుంటున్నారు. నిర్మానుష్యంగా ఏ ప్రాంతం కనిపించినా అక్కడే తిష్ఠ వేసి రోజూ మద్యం సేవిస్తున్నారు. పర్మిట్ రూమ్‌లు అందుబాటులో లేనందున ఖాళీ ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. చారిత్రక ప్రదేశమైన ఎర్రమంజిల్ ప్యాలెస్ ఇప్పుడు మందు బాబులకు అడ్డాగా మారిపోయింది. చుట్టు పక్కల ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నా ఏ మాత్రం జంకు లేకుండా సిట్టింగ్ వేస్తున్నారు. సెక్యూరిటీ లేకపోవడం, ఎవరూ పట్టించుకోనందున వీరి ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.
సెక్యూరిటీ ఉన్నా ఎలా?
ఈటీవీ భారత్ క్షేత్రస్థాయిలో పరిశీలించగా గుట్టల కొద్దీ ఖరీదైన మద్యం బాటిళ్లు, బీరు సీసాలు అక్కడ కనిపిస్తున్నాయి. ప్యాలెస్ చుట్టు పక్కల ఎక్కడ చూసినా మద్యం సీసాలే దర్శనమిస్తున్నాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మందుబాబులంతా అక్కడే మద్యం సేవిస్తూ రాత్రి వరకు గడుపుతున్నారు. సెక్యూరిటీ సిబ్బందిని నియమించినా అక్కడి వరకు వెళ్లి మద్యం ఎలా సేవిస్తున్నారన్నదే అసలు ప్రశ్న.