మహానగరంలో ఘోర ప్రమాదాలు.. నిర్లక్ష్యమే కారణం హైదరాబాద్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. అతివేగం, నిబంధనలు పాటించడంలో అలసత్వం... వాహనదారుల ప్రాణాల మీదికి తెస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం మేడ్చల్ పట్టణంలోని ఐటీఐ కళాశాల సమీపంలో కంటైనర్ కిందపడి 14ఏళ్ల బాలుడు మృతి చెందగా... మరో మైనర్ ప్రాణపాయస్థితిలో చికిత్స పొందుతున్నాడు. గచ్చిబౌలిలోని విప్రో కూడలి వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర దుర్ఘటనలో ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. అటు పటానుచెరు మండలం ముత్తంగి కూడలి వద్ద ద్విచక్రవాహనాన్ని కంటైనర్ డీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మృత్యువాతపడ్డారు. కూకట్‌పల్లి వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం తెల్లవారుజామున గంటలవ్యవధిలో జీహెచ్ఎంసీ పరిధిలో చోటు చేసుకున్న వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 8 మంది మరణించారు.
రోడ్డు ప్రమాదంలోనే ఎక్కువ..
చేవెళ్ల మండలం మల్కాపూర్ గేటు వద్ద ఈ నెల 2వ తేదీన జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. బొలేరో వాహనం, కారు ఢీకొట్టడంతో చిన్నారితో సహా 7గురు చనిపోయారు. నవంబర్ 10వ తేదీన పటాన్‌చెరు బాహ్యవలయ రహదారిపై టవేరా వాహనం బోల్తా పడి ఆరుగురు కూలీలు సంఘటనా స్థలంలోనే చనిపోయారు. రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు యంత్రాంగం కృషి చేస్తున్నా... దుర్ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అనారోగ్య సమస్యలు, ఇతర కారణాల వల్ల చనిపోయే వారి కంటే రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
నిర్లక్ష్యంతోనే..
ఎక్కవగా ప్రమాదాలు వాహనదారుల నిర్లక్ష్యం వల్లే చోటు చేసుకుంటున్నాయని అధికారిక గణంకాలు వెల్లడిస్తున్నాయి. పరిమితికి మించిన వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపి ఉంచడం లాంటి కారణాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. వాహనదారులు ఎడమ, కుడి వైపు మరలే క్రమంలో వెనక వైపు నుంచి వచ్చే వాహనాలను గమనించకుండా అలాగే ముందుకు పోతుండటం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సిగ్నల్ పడినా ఆగకుండ ముందుకు వెళ్తూ ప్రాణాలను గాల్లో దీపాలుగా మారుస్తున్నారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నారు.
బ్లాక్స్పాట్ల గుర్తింపు..
జీహెచ్ఎంసీ పరిధిలో రహదారి ప్రమాదాల నివారణకు అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. బ్లాక్‌స్పాట్‌లను గుర్తించి నివారణ చర్యలు చేపడుతున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నవంబర్ వరకు 2,951 ప్రమాదాలు జరగగా... 663మంది మృతి చెందారు. 3,013మంది గాయపడగా... 625 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఒక్క నవంబర్ మాసంలోనే అత్యధికంగా 81మంది చనిపోయారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 2,047 ప్రమాదాలు జరగగా... 533మంది ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,646 ప్రమాదాలు చోటు చేసుకోగా దాదాపు 196 మంది మృతి చెందారు. కొన్ని చోట్ల రహదారుల్లో లోపాల వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ప్రమాదాల నివారణకు జీహెచ్ఎంసీ, పోలీసు, రహదారులు మరియు భవనాలశాఖ అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.
ఇదీ చూడండి:కంటైనర్ కింద పడిన ద్విచక్ర వాహనం.. ఒకరు మృతి