ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా పోలీసులు భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 4 కోట్ల రూపాయల విలువ చేసే 4 టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని... 30 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వీరిలో బెంగళూరుకు చెందిన ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లు ఖలీల్ ఖాన్, అప్రోజ్ ఖాన్ ఉన్నారు. జిల్లాలోని మైదుకూరు, రాజంపేట నియోజకవర్గాల్లో పట్టుబడిన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.
కడప జిల్లాకు చెందిన 28 మంది స్మగ్లర్లు, బెంగళూరులోని కటిగనహళ్లి ప్రాంతానికి చెందిన ఇద్దరు బడా స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. నిందితుల నుంచి ఐదు వాహనాలు, నాలుగు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కొంతకాలంగా ఈ ముఠా సభ్యులు జిల్లా నుంచి ఎర్రచందనాన్ని నరికి బెంగళూరు కేంద్రంగా విదేశాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. వీరిలో ఆరుగురిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తున్నామని వివరించారు.