ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తర భారతదేశానికి భారీ మొత్తంలో గంజాయి అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్న ముఠాను నిర్మల్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురు ముఠా సభ్యులతో కొంత కాలంగా సాగుతున్న గంజాయి దందాను సోన్ పోలీసులు బట్టబయలు చేశారు. దిల్లీకి చెందిన సునీల్ కుమార్, జావీద్ షఫీ మరో నలుగురుతో కలిసి అక్రమ గంజాయి వ్యాపారం మొదలుపెట్టారు.
బట్టబయలైన గంజాయి దందా... భారీగా సరుకు స్వాధీనం - crime news
గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను నిర్మల్ జిల్లా సోన్ పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురు సభ్యులతో సాగుతున్న దందాలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గరి నుంచి 1.2 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
బక్రీద్ పండుగ సందర్భంగా మండలంలోని గంజాల్ టోల్ ప్లాజా వద్ద ఎస్సై ఆసీఫ్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పోలీసులను చూసిన దుండగులు కారును వేగంగా పోనిచ్చే ప్రయత్నం చేశారు. ఇంతలో అనుమానం వచ్చి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా... రూ.40 లక్షల విలువైన గంజాయి పట్టుబడింది. నిందితుల నుంచి కారుతో పాటు రూ. 22 వేల నగదు, 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ కారు సైతం దిల్లీలో ద్వారకనగర్‌లో దొంగతనం చేసి గంజాయి స్మగ్లింగ్‌కు వాడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మిగితా ముఠా సభ్యులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.