తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఆఫర్​ ఇచ్చి నెరవేర్చనందుకు కంట్రీక్లబ్​కు భారీ జరిమానా

క్లబ్ సభ్యత్వం తీసుకుంటే దుబాయ్​కి హాలిడే ట్రిప్ తీసుకెళ్తామని ఆఫర్​ ఇచ్చి నెరవేర్చనందుకు.. కంట్రీక్లబ్ యాజమాన్యానికి హైదరాబాద్ జిల్లా మూడో వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. సభ్యత్వ రుసుము తిరిగి ఇచ్చేయడంతో పాటు.. మానసిక ఆందోళనకు కారణమైనందుకు లక్ష రూపాయల జరిమానా చెల్లించాలని కంట్రీక్లబ్ హాస్పిటాలిటీ అండ్ హాలిడేస్ లిమిటెడ్ విభాగం కంట్రీ వెకేషన్స్ ను ఆదేశించింది.

ఆఫర్​ ఇచ్చి నెరవేర్చనందుకు కంట్రీక్లబ్​కు భారీ జరిమానా
ఆఫర్​ ఇచ్చి నెరవేర్చనందుకు కంట్రీక్లబ్​కు భారీ జరిమానా

By

Published : Oct 31, 2020, 1:28 PM IST

దుబాయ్ హాలిడే ట్రిప్ ఆఫర్ ఇచ్చి అమలు చేయనందుకు సభ్యత్వం సొమ్ము తిరిగి ఇచ్చేయటమే కాకుండా.. జరిమానా సైతం చెల్లించాలని కంట్రీక్లబ్​ను హైదరాబాద్ జిల్లా మూడో వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. కొండాపూర్​కు చెందిన కన్సల్టెంట్ రోషన్ కుమార్ అగర్వాల్ (38)... 2016 జులై 21న మంజీరా మాల్​కు వెళ్లినప్పుడు అక్కడ ఓ కూపన్ నింపారు. ఆ తర్వాత ఆగస్టు 5న కంట్రీ క్లబ్ ప్రతినిధి ఫోన్ చేసి రూ.35 వేల విలువైన హాలిడే ట్రిప్ వోచర్ లక్కీ విన్నర్​గా ఎంపికైనట్లు తెలిపారు.

కంట్రీ వెకేషన్స్ సభ్యత్వం తీసుకుంటే ఉచిత రవాణా, వారాంతపు డిన్నర్, క్లబ్ సదుపాయాలు ఉంటాయని వివరించారు. వార్షికోత్సవం సందర్భంగా దుబాయ్​లో మూడు రాత్రులు, నాలుగు రోజుల హాలిడే ట్రిప్ ప్రత్యేక ఆఫర్ కూడా ఉందని వివరించగా.. రోషన్ కుమార్ 2016 ఆగస్టు 6న రూ.1.20లక్షలు చెల్లించి సభ్యత్వం తీసుకున్నాడు. ఆగస్టు 28న రెండు మెంబర్ షిప్ కార్డులు, రశీదు మెయిల్ ద్వారా పంపించారు. దుబాయ్ హాలిడే ట్రిప్, ఇతర ఆఫర్లపై సమాచారం లేకపోవటం వల్ల... పలుమార్లు ఫోన్లు, మెయిల్ ద్వారా అడిగి విసిగిపోయాడు. చివరకు తాను చెల్లించిన రూ.1.20లక్షలు తిరిగి ఇచ్చేయాలని రోషన్ కుమార్ 2016 సెప్టెంబరు 20న మెయిల్ ద్వారా కోరారు. కంట్రీ క్లబ్ నుంచి స్పందన రాకపోవడం వల్ల వినియోగదారుల కమిషన్​ను ఆశ్రయించారు.

రోషన్ కుమార్ ఆరోపణల్లో నిజం లేదని వినియోగదారుల ఫోరానికి కంట్రీ వెకేషన్స్ తెలిపింది. దేశంలోని తమ క్లబ్బుల్లో మాత్రమే మూడు రాత్రులు, నాలుగు రోజుల హాలిడే ట్రిప్ ఆఫర్ ఇచ్చామని... ఆ విషయం ఒప్పంద పత్రంలో స్పష్టంగా ఉందని పేర్కొంది. ఏజెంట్ల మౌఖిక హామీలతో తమకు సంబంధం లేదని తెలిపింది. సభ్యత్వం కోసం చెల్లించిన సొమ్ము ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి ఇవ్వబోమని ఒప్పందంలోనే ఉందని.. దానిపై రోషన్ కుమార్ సంతకం చేశారని వివరించింది.

దుబాయ్ ట్రిప్ ఉంటుందని తనకు ప్రజెంటేషన్​లో చెప్పడమే కాకుండా.. సభ్యత్వం తీసుకునే సమయంలో చర్చించిన విధంగా హాలిడే ట్రిప్ ఉంటుందని సెంట్రల్ ఓఆర్డీ మేనేజర్ 2016 ఆగస్టు 9న పంపిన మెయిల్​లో అంగీకరించారని రోషన్ కుమార్ అగర్వాల్ వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న హైదరాబాద్ జిల్లా మూడో వినియోగదారుల కమిషన్.. కంట్రీ వెకేషన్స్​ది సేవా లోపమేనని తేల్చింది.

రోషన్ కుమార్ అగర్వాల్ చెల్లించిన రూ.1.20లక్షలు తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. మానసిక ఆందోళన కలిగించినందుకు రోషన్ కుమార్ కు రూ.లక్షతో పాటు, రూ.5వేల జరిమానా చెల్లించాలని పేర్కొంటూ... వినియోగదారుల కమిషన్ సభ్యురాలు లక్ష్మీప్రసన్న తీర్పు వెల్లడించారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో 2 లక్షల 38 వేలు దాటిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details