రాజధానిలో గుట్టుచప్పుడు కాకుండా రూ.కోట్లలో హవాలా సొమ్ము చేతులు మారుతోంది. 'హుండీ' పేరుతో కొనసాగుతున్న హవాలా కొద్దినెలలుగా రూపు మార్చుకుంది. గతంలో దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు పరిమితమై ప్రస్తుతం దేశంలోని మెట్రో నగరాలు, దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించింది. హైదరాబాద్‌లో ఈనెల 15న టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.3.75 కోట్లు ఇందుకు తాజా నిదర్శనం. ఇక్కడి ఏజెంట్లు దిల్లీ కంపెనీకి హవాలా సొమ్ము సమకూర్చుతుండగా పోలీసులు గుర్తించి నలుగురిని పట్టుకున్నారు.
తెరవెనుక ఈ దందా భారీస్థాయిలో సాగుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆన్‌లైన్ గేమ్‌లు నిర్వహిస్తున్న చైనా కంపెనీలు ఇక్కడి కంపెనీలకు హవాలా మార్గంలో సొమ్మును సమకూర్చుతుండగా.. కేరళలో గోల్డ్‌స్కామ్ నిందితురాలు స్వప్న సురేష్, ప్రైవేటు సంస్థలు, గుత్తేదారులకు హైదరాబాద్ ఏజెంట్లు ఈ సొమ్మును సరఫరా చేశారు. బ్యాంకులు, ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారిస్తే ఈ రాకెట్‌లో మరింతమంది నిందితులు పట్టుబడే అవకాశాలున్నాయని పోలీసులు చెబుతున్నారు.
చైనా కంపెనీల మాయాజాలం
ఆన్‌లైన్ గేమ్‌లు నిర్వహిస్తూ లింక్‌యున్, డోకీపే కంపెనీల ద్వారా రూ.వందల కోట్లను చైనీయులు హవాలా మార్గంలో మార్చుకున్నారు. లింక్‌యున్, డోకీపేలతో పాటు 30 కంపెనీలను ప్రారంభించి వాటిని పర్యవేక్షిస్తున్న చైనీయుడు యాన్‌హువో పక్కా ప్రణాళికతో హవాలా రాకెట్‌ను నడిపిస్తున్నాడని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌తో పాటు విశాఖ, రాజమండ్రి, విజయవాడ, కరీంనగర్, వరంగల్ నగరాల నుంచి చైనాకు ఎగుమతులు చేస్తున్న వ్యక్తులు, కంపెనీలకు రూ.30 కోట్ల వరకూ హవాలా సొమ్మును జమ చేశారు. తాజాగా హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతున్న రెండు సంస్థల ఖాతాల్లో రూ.20 కోట్లను బదిలీ చేసినట్టు తెలిసింది. ఆయా కంపెనీల ప్రతినిధులను పోలీసులు విచారించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులూ వీరిని ప్రశ్నిస్తున్నారు.