ఒకే దేశం, ఒకే పన్ను అన్న నినాదంతో వచ్చిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ) విధానంలో రెండోసారి చెల్లించిన పన్నును వ్యాపారికి తిరిగిస్తోంది జీఎస్టీ కౌన్సిల్. దీన్నే ఇన్‌ఫుట్ ట్యాక్స్ క్రెడిట్ విధానం అంటారు. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు.. కొనుగోలు చేసిన వస్తువుల విలువపై రెండోసారి జీఎస్టీ చెల్లించినట్లయితే.. ఆ మొత్తాన్ని సంబంధిత వ్యాపారి, కంపెనీ, వాణిజ్య సంస్థల ఖాతాల్లో నేరుగా జమయ్యే విధానం అమలువుతోంది. ఉత్పత్తిదారుడు లక్ష రూపాయలకు ఒక వస్తువును విక్రయించినప్పుడు.. దాని ఖరీదుపై విధించాల్సిన 18 శాతం జీఎస్టీని కొనుగోలుదారుడి నుంచి వసూలు చేస్తారు.
కామధేనువులా..
లక్షకు కొనుగోలు చేసిన వస్తువును వ్యాపారి.. లక్ష ఇరవై వేలకు అమ్మినట్లయితే.. కొనుగోలుదారుడు ఆ మొత్తానికి జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అప్పటికే లక్ష రూపాయలపై ఈ వ్యాపారి.. 18 శాతం జీఎస్టీ చెల్లించినందున లాభంపై మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ రెండోసారి చెల్లించిన మొత్తంలో లాభంపై జీఎస్టీ మినహాయించుకొని మిగిలిన సొమ్మును ఆ వ్యాపారి ఖాతాకు జమ అయ్యేట్లు ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేస్తోంది జీఎస్టీ కౌన్సిల్. ఈ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ విధానమే అక్రమార్కులకు కాసులు కురిపించే కామధేనువులా మారింది.
నోటికి వచ్చిన సంఖ్యలు..
ఛార్టడ్ అకౌంటెంట్ల సహకారంతో.. మూడో కంటికి తెలియకుండా కొందరు కుట్రపూరితంగా బోగస్ సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు అనామకుల ఆధార్‌కార్డులు, ఇతర పత్రాలను ఉపయోగిస్తూ అనుమతులు పొందుతున్నారు. ప్రధానంగా ఇనుము, ఐరెన్ స్క్రాప్, టైల్స్, మార్బుల్స్, గ్రానైట్ లాంటివి క్రయవిక్రయాలు చేసినట్లు కాగితాలపై లెక్కలు చూపిస్తారు. అనంతరం ఆ వస్తువులు ఒక దగ్గర నుంచి మరో చోటుకు వెళ్లకుండానే.. వెళ్లినట్లు ఈ వే బిల్లులు సృష్టిస్తారు. ఈ బిల్లులపై సరకు రవాణా అయినట్లు వాహనాల నంబర్లు వేయాల్సి ఉన్నా.. నోటికి వచ్చిన సంఖ్యలు వేస్తున్నారు. కోట్లాది రూపాయల వ్యాపారం చేసినట్లు టర్నోవర్ చూపిస్తున్నారు.
కాగితాలపైనే వ్యాపారాలు..
వ్యాపారం చేయకుండానే చేసినట్లు చూపి.. ఆయా నకిలీ బిల్లులను జీఎస్టీ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నారు.. తద్వారా వచ్చే ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను కాజేస్తున్నారు. మరోవైపు బోగస్ సంస్థలు కోట్లాది రూపాయలు వ్యాపారం చేసినట్లు కాగితాలపై చూపి.. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని.. వారినీ బురిడీ కొట్టిస్తున్నారు. ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు దేశవ్యాప్తంగా.. డేటా అనలిటిక్స్, జీఎస్టీ ఎకో సిస్టమ్, జీఎస్టీ ఇంటిలిజెన్స్ బృందాలు పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నాయి.