హైదరాబాద్ కేంద్రంగా 8 సెల్ కంపెనీల ద్వారా వ్యాపార లావాదేవీలు నిర్వహించినట్లు నకిలీ రశీదులను సృష్టించారు. ఎలాంటి వ్యాపారం చేయకుండానే రూ.1,445 కోట్ల విలువైన వ్యాపార లావాదేవీలు చేసినట్లు ఆ డొల్ల కంపెనీలు చూపాయి. వాటిని జీఎస్టీ వెబ్సైట్లో అప్లోడ్ చేశాయి. తద్వారా దాదాపు రూ.250 కోట్లు జీఎస్టీ రాయితీ పొందేందుకు ప్రయత్నించాయి. కాగితాల్లోనే వ్యాపార లావాదేవీలను చూపిన ఈ డొల్ల కంపెనీలు ప్రభుత్వం నుంచి రాయితీ పొందాలని చేసిన ప్రయత్నాలను జీఎస్టీ అధికారులు విఫలం చేశారు. బంజారాహిల్స్‌లోని ఆ కంపెనీలపై దాడులు నిర్వహించి... పెద్ద మొత్తంలో రబ్బర్ స్టాంపులు, ఇతర ధ్రువపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
విచారణకు సహకరించాలి: సుప్రీం
సెల్ కంపెనీలకు చెందిన ఓ డైరెక్టర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డొల్ల కంపెనీలకు చెందిన ఇతర డైరెక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. జీఎస్టీ అధికారులు జారీచేసిన నోటీసులను సవాల్ చేస్తూ... అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో వాదప్రతివాదనలు విన్న న్యాయస్థానం విచారణకు సహకరించాలని డైరెక్టర్లకు సూచించింది. దీంతో అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని సుప్రీం తోసిపుచ్చింది.