ఐఎంఎస్ కేసులో నిందితుల ఆస్తుల తాత్కాలిక జప్తునకు అనుమతి - acb on esi case
17:15 September 08
ఐఎంఎస్ కేసులో నిందితుల ఆస్తుల తాత్కాలిక జప్తునకు అనుమతి
బీమావైద్యల సేవల కుంభకోణంలో నిందితుల ఆస్తుల తాత్కాలిక జప్తునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఐఎంఎస్ సంయుక్త సంచాలకురాలు పద్మ, ఫార్మాసిస్టు నాగలక్ష్మి ఆస్తులకు జప్తునకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంయుక్త సంచాలకురాలు పద్మ, ఆమె కుంటుంబసభ్యులు, బినామీల పేరు మీద రూ.8.55కోట్ల విలువైన ఆస్తుల జప్తునకు అనుమతిచ్చింది. ఫార్మాసిస్టు నాగలక్ష్మి, ఆమె కుటుంబ సభ్యుల పేరుమీద ఉన్న రూ.2.72 కోట్ల ఆస్తుల జప్తునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ అక్రమమార్గంలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు అవినీతి నిరోధక శాఖ దర్యాప్తులో తేలింది. ఆస్తుల జప్తునకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి అవినీతి నిరోధక శాఖ లేఖ రాసింది. ఈ మేరకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి బీమా వైద్యసేవల విభాగంలో ఔషధాలు కొనుగోలు చేసినట్లు అనిశా దర్యాప్తులో తేలింది. కోట్ల రూపాయల కొల్లగొట్టినట్లు తేల్చిన అనిశా అధికారులు ఐఎంఎస్ అధికారులను, సహకరించిన ఔషధ సంస్థల నిర్వాహకులను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.