శంషాబాద్ విమానాశ్రయంలో రూ.6.62 కోట్లు విలువైన బంగారం స్వాధీనం - శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
17:48 October 04
శంషాబాద్ విమానాశ్రయంలో రూ.6.62 కోట్లు విలువైన బంగారం స్వాధీనం
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు ఎనిమిది కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు ఎయిర్పోర్ట్ కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ శివకృష్ణ తెలిపారు. సుమారు రూ.6.62 కోట్ల విలువ ఉంటుందని అంచనా వేసినట్టు వివరించారు. ఈ నెల 3న తెల్లవారుజామున సరైన పత్రాలు లేకుండా బంగారు బిస్కెట్లు, ఆభరణాలతో కూడిన పార్శిల్‌ను హైదరాబాద్ నుంచి ముంబయికి తరలిస్తున్నట్టు పేర్కొన్నారు. ఏలాంటి పత్రాలు లేకపోవడం వల్ల అనుమానంతో ఆరా తీసినట్టు వెల్లడించారు.
పార్శిల్ తెరచి చూడగా వివిధ రకాల బంగారు ఆభరణాలు, విదేశీ బంగారు కడ్డీలు, వజ్రాలు, విలువైన రాళ్లు, స్టెయిన్‌లెస్ స్టీల్ గడియారాలు, ప్లాటినం టాప్స్, పురాతన నాణేలు... గుర్తించామన్నారు. ఏలాంటి పత్రాలు లేకుండా పెద్ద మొత్తంలో బంగారాన్ని తరలించడం... కస్టమ్స్ చట్టం-1962, కేంద్ర జీఎస్టీ చట్టం-2017 నిబంధనలకు వ్యతిరేకమన్నారు. స్వాధీనం చేసుకున్న బంగారంలో... బిస్కెట్లు 2.37 కిలోలు, ఆభరణాలు 5.63 కిలోలు ఉన్నట్టు వెల్లడించారు. తదుపరి విచారణ కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు.