హైదరాబాద్ ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్‌లో పనిచేస్తున్న కడెం శ్యామ్ అనే కాంట్రాక్ట్ డ్రైవర్ మృతి చెందాడు. ఇటీవల అనారోగ్యంపాలు కావడం వల్ల శ్యామ్‌ను అధికారులు విధుల్లోకి తీసుకోలేదు. కొన్ని రోజుల క్రితం జీహెచ్ఎంసీ అధికారులు కాంట్రాక్టును కూడా రద్దు చేశారు.
'అధికారుల వేధింపుల వల్లే జీహెచ్ఎంసీ డ్రైవర్ చనిపోయాడు' - ghmc employees protest
జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ డ్రైవర్ మృతి చెందాడు. అనారోగ్యంపాలు కావటం వల్ల అధికారులు విధుల్లోకి తీసుకోకపోగా... కాంట్రాక్టు సైతం రద్దు చేశారు. తీవ్ర మనస్తాపంతో సదరు డ్రైవర్ ఆస్పత్రి పాలై.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అధికారుల వేధింపుల వల్లే డ్రైవర్ మృతి చెందాడని తోటి ఉద్యోగులు ఆందోళన చేశారు.

తీవ్ర మనస్తాపానికి గురైన శ్యామ్... ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం శ్యామ్ మృతి చెందాడు. కరోనా కష్ట కాలంలో ఆదుకోవాల్సిన అధికారులు ఉద్యోగం నుంచి తీసివేయడమే కాకుండా... వేధించటం వల్లే డ్రైవర్ శ్యామ్ మృతి చెందాడని తోటి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
ఉన్నతాధికారుల వేధింపుల కారణంగానే కాంట్రాక్ట్ డ్రైవర్ స్వామి మృతి చెందాడని బీఎంఎస్ అధ్యక్షుడు శంకర్ ఆరోపించారు. గత కొంత కాలంగా ఉన్నతాధికారులు కాసుల కోసం కింది స్థాయి ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. మృతి చెందిన శ్యామ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ... ఖైతరాబాద్ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ధర్నాకు దిగారు. వేధింపులకు గురిచేస్తున్న ఉన్నతాధికారులకు వెంటనే విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.