కొత్తరకం మోసం ప్రజలను ఆందోళన గురిచేస్తోంది. నూతన గృహ నిర్మాణ దారులే లక్ష్యంగా మోసాలకు తెరతీశారు. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలంలోని పలు గ్రామాలలో ద్విచక్రవాహనంపై తిరుగుతూ మోసం చేస్తున్నారు. కొద్ది రోజులుగా కమాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది వ్యక్తులు గృహాలు నిర్మించే మేస్త్రీలను సంప్రదించి యజమానుల వివరాలు సేకరిస్తున్నారు.
గృహనిర్మాణ దారులే లక్ష్యంగా మోసాలు.. నయామోసాలకు తెర - peddapalli dist news
మోసపోయేవాడు ఉండాలే కానీ ఎలాగైనా మోసగించేందుకు సిద్ధమవుతున్నారు దుండగులు. గృహనిర్మాణ దారులే లక్ష్యంగా రెచ్చిపోతున్నారు. తక్కువ ధరకే ఇసుక, కంకర సరఫరా చేస్తామంటూ కొత్తరకం మోసాలకు తెరలేపారు. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం రొంపికుంట గ్రామంలో ఇలాంటి మోసం వెలుగుచూసింది.
మీకు తక్కువ ధరకే కంకర, ఇసుక సరఫరా చేస్తామని మీ మేస్త్రి మాకు చెప్పారని గృహ నిర్మాణ యజమానులను సంప్రదిస్తున్నారు. తర్వాత మీ ఇంటికి ఇసుక, కంకరను తీసుకొస్తున్న సమయంలో ట్రాక్టర్ డీజిల్ అయిపోయిందని.. వెంటనే డబ్బులు ఇస్తే డీజిల్ పోయించుకుని తీసుకోస్తామని డబ్బులతో ఉడాయిస్తున్నారు.
రొంపికుంట గ్రామంలో ఘటన :
మండలంలోని రొంపికుంట గ్రామంలో ఏర్ని మధు నిర్మిస్తున్న నూతన ఇంటి వద్దకు వెళ్లారు. అక్కడే ఉన్న మధు చెల్లితో మీకు కంకర తీసుకొస్తుండగా మా వాహనాల్లో డీజిల్ అయిపోయిందని చెప్పి.. డబ్బులు తీసుకుని అక్కడ నుంచి ఉడాయించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామం నుంచి మెయిన్ రోడ్డు వెంట కలవచర్ల వైపు ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు వెళ్లినట్లు.. సీసీ ఫుటేజ్‌లో గుర్తించామని ఎస్సై శ్యాంప్రసాద్ తెలిపారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.