విశాఖ రాంకీ ఫార్మాసిటీలోని ‘విశాఖ సాల్వెంట్స్’ సంస్థలో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సాల్వెంట్ రికవరీ కాలమ్‌లో ప్రమాదం సంభవించడంతో మంటలు భారీఎత్తున ఎగసిపడ్డాయి. సంస్థ ప్రాంగణంలో ఉన్న రసాయనాల డ్రమ్ములకు కూడా మంటలు అంటుకోవడంతో అవి భారీ శబ్దాలతో పేలిపోయాయి. ఆ శబ్దాల ధాటికి స్థానికులు తీవ్రంగా భీతిల్లారు. శబ్దాలు సుమారు 10 కిలోమీటర్ల దూరం వరకు వినిపించడం వాటి తీవ్రతకు నిదర్శనం. మంటలు 30 నుంచి 50 అడుగుల ఎత్తు వరకు ఎగసిపడడంతో ప్రమాద తీవ్రతను చూసి పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
భయంతో పరుగులు
ఫార్మాసిటీకి సమీపంలోని హెచ్‌టీ విద్యుత్తు లైన్లు కూడా వేడి తీవ్రతకు తెగి కిందపడ్డాయి. ప్రమాదాన్ని చూసిన సమీపంలోని పలు ఫార్మా సంస్థల్లో రాత్రి విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, కార్మికులు భయంతో పరుగులు తీశారు. అగ్నికీలల తీవ్రత క్షణక్షణానికీ పెరుగుతుండడంతో ఫార్మాసిటీ పరిసర గ్రామాల్లోని వారు ఇళ్లు ఖాళీ చేసి కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెట్టారు. నల్లని పొగలు కూడా దట్టంగా కమ్ముకోవడంతో సంస్థలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అగ్ని ప్రమాదంలో ఒకరు గాయపడడం మినహా ప్రాణనష్టం సంభవించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
మిగిలిన పరిశ్రమలు సురక్షితమే
ఫార్మాసిటీలో ఒకేచోట ఏకంగా 85 ఫార్మా సంస్థలు ఉన్నాయి. మంటలు మరింత విస్తరించి ఇతర సంస్థలకు వ్యాపిస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తమైంది. అయితే అలాంటి అవకాశం లేదని ఫార్మాసిటీ సీఈవో లాల్‌కృష్ణ ‘ఈనాడు’కు చెప్పారు. మరోవైపు ఫార్మాసిటీ పరిసరాల్లోని తానాం, పరవాడ, తాడి, లంకెలపాలెం, ఈబోనంగి, గొర్లువానిపాలెం తదితర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.