పరిశ్రమలో పేలిన రియాక్టర్.. 8మంది కార్మికులకు గాయాలు - IDA Bollaram latest news

13:52 December 12
సంగారెడ్డి: బొల్లారంలోని వింధ్య ఆర్గానిక్ పరిశ్రమలో పేలిన రియాక్టర్
సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పారిశ్రామిక వాడలోని వింధ్యా ఆర్గానిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించి మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో పరిశ్రమ నుంచి కార్మికులు పరుగులు తీశారు. మరికొందరు కార్మికులు పరిశ్రమలోనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే భయంతో చుట్టుపక్కల పరిశ్రమల కార్మికులూ పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులకు గాయాలు కాగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు బాచుపల్లిలోని మమత ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన వారిని వెంకటేశ్, రిషికేశ్ కుమార్, ఈరేశ్ రేష్మా, శ్రీకృష్ణ, విద్యా భాను, రాజా రావు, రజినీ, ఆనంది పార్థీలుగా గుర్తించారు. పేలుడు సంభవించిన యూనిట్-1లో దాదాపు 40 మంది కార్మికులు విధులు నిర్వహస్తున్నట్లు తెలుస్తోంది.
ఘటనా స్థలానికి చేరుకున్న 4 అగ్నిమాపక శకటాలు మంటలు ఆర్పుతుండగా.. మరికొన్ని అగ్నిమాపక శకటాలను తెప్పించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. భారీ స్థాయిలో అగ్ని ప్రమాదం సంభవించడంతో పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. పరిశ్రమలోని రియాక్టర్ పేలడం వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. షిఫ్ట్‌ఛార్టుల ఆధారంగా ఎంత మంది పరిశ్రమలో ఉన్నారన్న దానిపై యాజమాన్యం ఆరా తీస్తోంది. దట్టంగా పొగలు అలుముకోవడంతో పరిశ్రమలో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. భారీ స్థాయిలో పొగలు అలుముకోవడంతో చుట్టుపక్కల పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులను ఆయా పరిశ్రమల యాజమాన్యాలు ఖాళీ చేయిస్తున్నారు. అంతే కాకుండా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా చుట్టుపక్కల పరిశ్రమల్లోని రియాక్టర్లను సిబ్బంది చల్లబరుస్తున్నారు.
8 మంది కార్మికులకు గాయాలు అయ్యాయి. రిజిస్టర్ చూసి ఎంతమంది డ్యూటీకి వచ్చారో చెప్పగలుతాం - అగ్నిమాపక సిబ్బంది.