తన జీవనానికి అండగా నిలిచిన పొలంలోనే ఓ రైతు విద్యుదాఘాతంతో దుర్మరణం చెందిన ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం అందుగులపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోయిని రాములు (47)కు అందుగులపల్లి- ధర్మారం మధ్య ఉన్న తన పొలంలో వరి నాట్లు వేశారు. రోజులాగే పొలానికి వెళ్లిన రాములు మధ్యాహ్నామైనా తిరిగి రాకపోవటం వల్ల కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు.
విద్యుదాఘాతంతో పొలంలోనే రైతు మృతి - medak news
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం అందుగులపల్లిలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో తన పొలంలోనే రైతు తుదిశ్వాస విడిచారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పొలం గట్టుపైనే ఉన్న నియంత్రిక నుంచి ఏర్పాటుచేసిన తీగలకు విద్యుత్తు సరఫరా జరుగుతోంది. తీగలపై ఉన్న ఇన్సులేషన్ తొలగిపోవటం వల్ల షాక్ కొట్టి రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. మృతుడికి భార్య వెంకటమ్మ, ఒక కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య వెంకటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.