సూర్యాపేట జిల్లా మోతె గ్రామానికి చెందిన పల్లెల ఈదమ్మ కుటుంబానికి 1984లో బలహీనవర్గాల కోటా కింద సర్వే నంబర్ 232లో 150 గజాల స్థలాన్ని కేటాయించారు. 120 గజాల్లో ఇల్లు కట్టుకున్నారు. మిగిలిన 30 గజాల స్థలంలో గుడిసె వేసుకుంటుండగా... గ్రామానికి చెందిన కొంత మంది అడ్డుకున్నారు. సదరు వ్యక్తులపై ఈ నెల 26న మోతె ఎస్సై గోవర్ధన్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. మూడు రోజులు కావస్తున్నా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
ఎస్పీ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం - కుటుంబసభ్యుల ఆత్మహత్యాయత్నం
భూ వివాదంలో మోతె ఎస్సై పక్షపాతం వహిస్తున్నాడంటూ... ఓ కుటుంబం సూర్యాపేట ఎస్పీ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఎస్సైని సస్పెండ్ చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
![ఎస్పీ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం family suicide attempt before suryapeta sp office](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7835763-thumbnail-3x2-sucide.jpg)
ఎస్సై లంచం ఆశిస్తే తాము ఇవ్వనందున... వైరి పక్షంతో కుమ్మక్కయ్యారని ఈదమ్మ కుటుబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఎస్సై అండతో తమపై విచక్షణ రహితంగా దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగదని భావించిన బాధితురాలు ఇద్దరు కుమారులతో ఎస్పీ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన సెంట్రీ వారిని వారించడం వల్ల ప్రమాదం తప్పింది. ఎస్సై గోవర్ధన్‌ను సస్పెండ్ చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎస్పీ భాస్కరన్‌కు విజ్ఞప్తి చేశారు. ఘటనపై పూర్తి విచారణకు ఎస్పీ ఆదేశించారు.