తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

డబ్బులు కావాలని ఫేస్​బుక్​లో ఎస్పీ మెస్సేజ్! - prakasam district latest news update

అమలాపురం నుంచి అమెజాన్​ వరకు.. సామాన్యుడి నుంచి సైనికుడి వరకు ఇలా అన్నింటిని.. అందరిని వాడుకుంటూ విచ్చలవిడిగా మోసాలకు పాల్పడుతున్నారు సైబర్​ నేరగాళ్లు. ఇదంతా ఒకెత్తు అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సంఘటన మరో ఎత్తు. నేరగాళ్ల ఆట కట్టించే పోలీసులమని చెప్పి మోసాలు చేయడం పాత పద్దతి. ఏకంగా ఎస్పీ పేరు చెప్పి దర్జాగా దోచేయడమే ఈ సైబర్ నేరగాళ్ల నయా స్టైల్​.

Fake Facebook account with SP name
ఎస్పీ పేరుతో నకిలీ ఫేస్​బుక్ ఖాతా

By

Published : Nov 17, 2020, 2:35 PM IST

కేటుగాళ్ల నడ్డి వంచి.. నేరాలను నియంత్రించే పోలీసుల పేరు చెప్పి.. మోసాలకు పాల్పడుతున్నారు నయా నేరగాళ్లు. పోలీసులను బురిడీ కొట్టించేందుకు ఏకంగా ఎస్పీ పేరునే వాడుకుంటున్నారు. ఏపీలోని ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్ధ్ కౌశల్​ పేరుతో నకిలీ ఫేస్​బుక్​ అకౌంట్​ను ప్రారంభించి, దాంతో ఫ్రెండ్​ రిక్వెస్ట్​లు పంపించి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఇప్పటికే పలువురి ఎస్ఐ, సీఐల పేరుమీద నకిలీ ఖాతాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఎస్పీ పేరుతో నకిలీ ఫేస్​బుక్ ఖాతా

నకిలీ ఫేస్​బుక్​ ఖాతా ద్వారా ఓ పాత్రికేయుడికి ఎస్పీ సిద్ధార్ద్ కౌశల్​ పేరుతో స్నేహ అభ్యర్ధన వచ్చింది. ఎస్పీ కదా అని పాత్రికేయుడు ఆమోదం తెలిపాడు. కొద్ది సేపటికే మెసెంజర్​లో చాటింగ్ ప్రారంభించాడు. ఎస్పీ కదా అని సదరు పాత్రికేయుడు కూడా మర్యాదగా చాటింగ్ చేశాడు. అంతలోనే అభ్యర్ధన. 'మీతో ఓ అవసరం పడింది. కొంత నగదు కావాలి.. ఫోన్ పే చేస్తే రేపే తిరిగిచ్చేస్తా.. అంటూ సందేశం పంపాడు. 15 వేల రూపాయలు కావాలని అభ్యర్ధించగా.. పాత్రికేయుడు అవాక్కయ్యాడు. సంబంధిత పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్పీ అప్రమత్తమయ్యారు. తన పేరుపై ఉన్నది నకిలీ ఖాతా అని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

అప్పటికే పలువురికి ఎస్పీ పేరుతో నకిలీ అకౌంట్​ నుంచి అభ్యర్ధనలు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడితో ఆగని సైబర్ కేటుగాళ్లు జిల్లాలో పలువురి సీఐ, ఎస్​ఐల పేరుతో కూడా నకిలీ ఫేస్​బుక్​ అకౌంట్​లు తెరిచి డబ్బులు అడుగుతున్నట్లు తెలుసుకున్నారు. అప్రమత్తమైన ఆయా పోలీస్​ అధికారులు.. నకిలీ ఖాతాల విషయమై తమ తమ అధికారిక ఖాతాల్లో పోస్టులు పెట్టారు. గతంలో ఒకరిద్దరు సీఐ, ఎస్ఐల పేరు మీద నకిలీ అకౌంట్​లు సృష్టించి డబ్బులు వసూళ్లకు ప్రయత్నించినా.. అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా ఎస్పీ పేరు మీదే ఫేస్​బుక్​లో నకిలీ అకౌంట్ తెరవడం, నగదు వసూలుకు ప్రయత్నించడం సీరియస్​గా తీసుకున్న పోలీసులు, నేరస్థుడిని గుర్తించే పనిలో పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details